జనగామ జిల్లా ;పాలకుర్తి మండలం వావిలాలలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో దొంగరి నారాయణ-పిచ్చమ్మ దంపతులకు 1941 డిసెంబర్ 24న నవీన్ జన్మించారు. నాల్గో తరగతిలో ఉండగానే రచనలతో ఉపాధ్యాయుల మెప్పు పొందారు. ఆనాడే రత్నాకరుడు పేరుతో కథలు రాయడం ఆరంభించారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఓ లిఖిత భాష పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన తర్వాత నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో లెక్చరర్‌గా పనిచేశారు. ఆయన తొలినాళ్లలో రచించిన ముళ్లపొదలు, అంతస్రవంతి, అంపశయ్య, నవలాత్రయాలు గుర్తింపు పొందాయి. అనేక యదార్థ సంఘటనలు, సంఘర్షణలను ఇతివృత్తంగా రచనలు చేసేవారు. ఆయన ప్రపంచానికి అందించిన రచనలు ఓరుగల్లు వారసత్వ సంపదగా నిలిచాయి. ఓయూలో సంఘటనలను అంపశయ్య నవలగా రచించి ఇంటిపేరుగా మార్చుకొని నవలా శిఖరాగ్రంగా ఎదిగారు. ఆయన వందకు పైగా కథలు, విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. మరెన్నో రచనలు చేసి ఓరుగల్లుకు నోబెల్ పురస్కారాన్ని నడిపించుకుంటూ తీసుకురావాలని ఆశించారు.
వరించిన అవార్డులు, పురస్కారాలు
2004 సంవత్సరంలో కాలంరేఖలు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. ఇదే సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1977 నుంచి 1999 వరకు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి సీనియర్ ఫెల్లోషిప్ పొందారు. 2010లో గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం తీసుకున్నారు. 2013లో తెలుగు అకాడమీ హైదరాబాద్ నుంచి వచన రచయితగా మహాకవి జాషువా పురస్కారాన్ని అందుకున్నారు. 2015లో అమెరికాలోని రామినేని ఫౌండేషన్ నుంచి విశేష పురస్కారం, అలాగే అక్కడ తెలంగాణ ఎన్ఆర్ఐ నుంచి కాళోజీ స్మారక పురస్కారాన్ని పొందారు. వంశీ ఆర్ట్ థియేటర్ శుభోదయం సంస్థ నుంచి జీవిత సాఫల్య పురస్కారం, 2019లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే కాళోజీ పురస్కారం పొందారు. 2022లో గీతం యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల నుంచి కీర్తి శిఖరం సహా పలు అవార్డులు తీసుకున్నారు. వెయ్యేళ్ల తెలుగు సాహితీ ప్రపంచంలో వెలువడిన వేలాది గ్రంథాల్లో వెలికితీసిన వంద ఆణిముత్యాల్లో నవీన్ రాసిన అంపశయ్యకు చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణం.
స్వచ్ఛంద సంస్థలతో ఎనలేని అనుబంధం
1978లో కొందరు మిత్రులతో కలిసి కరీంనగర్ ఫిల్మ్ సొసైటీని ఏర్పాటు చేసి, నాలుగేళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. 1987 నుంచి వరంగల్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇండో అమెరికన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ హైదరాబాద్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అకడమిక్ సభ్యులుగా పనిచేశారు. వరంగల్‌లోని సృజన లోకం(రైటర్స్ కార్నర్) అధ్యక్షుడిగా, ప్రపంచ శాంతి పండుగ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. కాళోజీ సోదరులు ఏర్పాటుచేసిన మిత్రమండలి సాహితీ సంస్థకు కన్వీనర్‌గా పనిచేశారు. అలాగే కాళోజీ ఫౌండేషన్‌కు ముఖ్య సలహాదారుగా ఉన్నారు.
పుట్టిన రోజు నాడే రెండు గ్రంథాల ఆవిష్కరణ
నవీన్ ఏటా తన పుట్టిన రోజున రెండు గ్రంథాలను ఆవిష్కరించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు. 2001 నుంచి 44 ఆవిష్కరించారు. నేడు 81 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా క్షమించు రాధ, ముళ్లపొదలు గ్రంథాలను హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఉదయం 11 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఆయన రచించిన అంపశయ్య నవలా ఆధారంగా సినిమా కూడా వచ్చింది. ఆయన రచించిన చాలా రచనలు ఇతర భాషల్లోకి అనువాదం చేశారు. అంపశయ్య నవీన్ జీవితం, సాహిత్యంపై ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో పరిశోధనలు జరిగాయి. అలాగే నవలా రచయిలను ప్రోత్సహిస్తూ అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2012 నుంచి అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు 19 మందికి పురస్కారాలు అందజేశారు.