ఆర్థిక పరిస్థితి బాగాలేదని తాపీమేస్త్రీ.. భర్తతో గొడవనో లేక మరే కారణమో రెండేళ్ల కూతురితో ఓ వివాహిత రైలు పట్టాలపై, ప్రజలను భయపెట్టేలా దెయ్యం వీడియో పెట్టి దొరికిన భయంతో యువకుడు పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో తీసుకొని ఇక చనిపోతున్నామంటూ మృత్యువుకు ఎదురువెళ్లగా సకాలంలో స్పందించిన పోలీసులు ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడారు.
లొకేషన్ ద్వారా ఇద్దరిని, ఘటన స్థలంలోనే జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి మరొకరి లైఫ్‌ను సేవ్ చేశారు. వరంగల్, ములుగు జిల్లాల్లో వేర్వేరు చోట్ల ఈ ఘటనలు జరుగగా సాంకేతికను అందిపుచ్చుకొని క్షణాల్లో అక్కడికి వాలిపోయిన పోలీసులను వారి కుటుంబసభ్యులు, ప్రజలు అభినందించారు.
– ములుగు, సెప్టెంబర్13 (నమస్తే తెలంగాణ)/ ఖిలావరంగల్/సంగెం
ములుగు, వరంగల్ జిల్లాలోని వేర్వేరు చోట్ల శుక్రవారం ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి వారిని కాపాడారు. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం రాజన్నపేటకు చెందిన వాసం నాగరాజు ఇటీవల సోషల్ మీడియాలో తమ గ్రామంలో దెయ్యం తిరుగుతున్నదని వాట్సాప్ గ్రూప్‌లో వీడియో పోస్ట్ చేశాడు.
దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురికాగా, స్థానిక ఎస్సై గ్రామానికి చేరుకొని మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. అయితే వీడియో పోస్ట్ చేసింది నాగరాజుగా గుర్తించిన ఎస్సై అతడిని మందలించాడు. దీంతో అతడు ఎస్సైతో తనకు ప్రాణభయం ఉందని, తన చావుకు ఆయనే కారణమంటూ పురుగు మందు డబ్బాతో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు ఎస్సై వెంటనే లొకేషన్ ఆధారంగా సిబ్బందితో వెళ్లి నాగరాజును రక్షించారు.
హనుమకొండకు చెందిన పీ మానస తన రెండేళ్ల కూతురితో ఆత్మహత్య చేసుకునేందుకు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి రైలు పట్టాలపై కాజీపేట వైపు నడుచుకుంటూ వెళుతున్నది. ఈ క్రమంలో ఆన్‌డ్యూటీ పెట్రోలింగ్ సిబ్బంది ఈ విషయమై సమాచారం ఇవ్వడంతో జీఆర్పీ సిబ్బంది కే విక్రం, కే ప్రశాంత్, సీహెచ్ సుమలత అక్కడకు చేరుకొని తల్లి, కూతురిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సోదరుడు క్రాంతికుమార్, భర్త ప్రవీణ్ రాగా, కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం వారికి అప్పగించారు.
ఎనుమాముల మార్కెట్ సమీపంలోని ఎంఎస్కాలనీలో నివాసం ఉంటున్న బండి రాజు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు సంగెం మండలం చింతలపల్లి రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. ఇంటికి ఫోన్ చేసి రైలు కింద పడి చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు 100కు డయల్ చేసి లొకేషన్ చెప్పటంతో సంగెం ఎస్సై ఎల్ నరేశ్ తన సిబ్బందిని పంపించారు. ట్రాక్ మధ్యలో మద్యం మత్తులో పడుకొని ఉన్న రాజును కానిస్టేబుల్ సురేశ్ పక్కకు తీసుకొచ్చి కాపాడాడు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారికి అప్పగించారు.