మావోయిస్టు చర్చల ప్రతినిధి బృందంలో ఆఖరి ‘చుక్క’ రాలిపోయింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలోని చిన్నదోర్నాలలో ఆవిష్కృతమైన దృశ్యాన్ని వెలిశాల గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. మావోయిస్టుల నుంచి చర్చల్లో పాల్గొన్న రామకృష్ణ(ఆర్కే), సుధాకర్, గణేశ్. ఈ ముగ్గురు ఆలీవ్గ్రీన్ దుస్తులు కాకుండా సివిల్ డ్రెస్ల్లో వచ్చారని తెల్లచొక్కా, బూడిద రంగు ప్యాంటు, తలపైన మెరుస్తున్న నక్షత్రపు టోపీ ధరించారని, ‘చాలా ఏండ్ల తరువాత అప్పుడే ‘మా రవిని చూశామని వెలిశాల గ్రామస్థులు నాడు టీవీల్లో చూసిన సన్నివేశాన్ని వివరించారు.
చర్చలకు వచ్చిన మావోయిస్టు ముగ్గురిలో ఆనారోగ్య కారణాలతో ఆర్కే మరణించగా ఇటీవలే సుధాకర్ ఎన్కౌంటర్లో మృతి చెందారు. తాజాగా, బుధవారం మారేడుమిల్లి ఎన్కౌంటర్లో గాజర్ల రవి హతం కావటంతో ఆ చర్చల్లో మావోయిస్టుల నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురూ మృతి చెందటం గమనార్హం. కాగా, జనశక్తి పార్టీ నుంచి చర్చల్లో పాల్గొన్న ఇద్దరిలో రియాజ్ ఎన్కౌంటర్లో హతం అయ్యారు. మొత్తానికి అటు మావోయిస్టులు, ఇటు జనశక్తి నక్సల్స్ల్లో మొత్తం ఐదుగురు చర్చల్లో పాల్గొనగా వారిలో నలుగురూ మృతి చెందారు.