మట్టెవాడ, జూలై 18 : భారీ శబ్దం చేస్తూ బుల్లెట్ బండికి మాడిఫైడ్ సైలెన్సర్ తగిలించుకొని రయ్‌మని దూసుకెళ్లే ఆకతాయిలకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు తనిఖీలు చేసి పట్టుకున్నా వారిలో మార్పు రాకపోవడంతో సైలెన్సర్లపై కొరడా ఝళిపించారు. వరంగల్ సీపీ అంబర్కిశోర్ ఝా ఆదేశాల మేరకు గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎంజీఎం కూడలిలో ఉదయం నుంచి ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సూచనల మేరకు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది తనిఖీలు చేసి భారీ శబ్దంతో వెళ్తున్న బుల్లెట్ వాహనాలను పట్టుకున్నారు.
మొత్తం 155 మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. గత ఏప్రిల్‌లో 255 వాహనాల సైలెన్సర్లు ధ్వంసం చేశామని ఇకనుంచి రాత్రివేళల్లో కూడా తనిఖీలు చేసేందుకు ఎస్సై, మరో ఐదుగురు సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. ఎవరైనా భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో హనుమకొండ ట్రాఫిక్ సీఐ శుక్రు, కాజీపేట సీఐ నాగరాజు, ట్రాఫిక్ ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.