పాలకుర్తి/దేవరుప్పుల/కొడకండ్ల, డిసెంబర్ 10 : బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఊహించలేమని.. బతుకమ్మ స్థానంలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించడం చారిత్రక తప్పిదమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు తెలియని సీఎం రేవంత్‌రెడ్డి చరిత్రను మార్చాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. కాం గ్రెస్ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించి తెలంగాణ సం స్కృతీ సంప్రదాయాలను విస్మరించినందుకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విగ్రహ మార్పు ను నిరసిస్తూ మంగళవారం దేవరుప్పుల మం డలం సీతారాంపురం, పాలకుర్తి మండలం దర్దేపల్లి, కొడకండ్ల మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహాలకు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎర్రబెల్లి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే, దీక్షకు భయపడే కేంద్రం తెలంగాణ ఇచ్చిందనేది అక్షర సత్యమని అన్నా రు. నాడు సోనియాగాంధీని బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ఇచ్చిన దేవత అని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. తామంతా టీడీపీలో ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తూ కేంద్రానికి లేఖ రాద్దామన్నప్పుడు రేవంత్‌రెడ్డి వ్యతిరేకించారని.. అలాంటి తెలంగాణ ద్రోహికి తెలంగాణ పదం ఉచ్చరించే అర్హత లేదన్నారు. ఆనాడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వకపోతే అందరం టీడీపీని వీడుతామని చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చామని గుర్తుచేశారు.
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిన రేవంత్‌రెడ్డి, ప్రజాపాలన అంటూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. హైడ్రా పేర కూల్చివేతలు, ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుం డా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు బిల్లుల కోసం మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే వారి ని ఎక్కడికక్కడ బంధించి నియంతృత్వంగా వ్య వహరిస్తున్నాడని.. అలాగే ఆశ కార్యకర్తలను నిర్బంధించి కొట్టడం ఎంతవరకు సమంజసమ ని ప్రశ్నించారు. అనంతరం ఉద్యమకారులు ఆ వుల వీరన్న, బస్వ రమేశ్, బాషిపాక కొండయ్యలకు శాలువాలు కప్పి సన్మానించారు.
రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మరో ఉద్యమం..
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని ఎర్రబెల్లి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్క రోజు కూడా పాల్గొనలేదన్నారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ రైఫిల్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం టీడీపీ ఎమ్మెల్యేలుగా తాము 15 మంది రాజీనామా చేస్తే పారిపోయిన దొంగ రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఓ అవినీతిపరుడు, బ్లాక్ మెయిలర్, మోసగాడని అధికారం కోసం అడ్డదారులు తొక్కి ప్రజలను మోసం చేసిన చరిత్ర ఆయనదన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 మోసాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని ప్రజలు ఉరికించి కొడుతారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మరో ఉద్యమం ప్రారంభమవుతుందని, అందులో ఆయన కొట్టుకుపోవడం ఖాయమన్నారు.
ప్రజలే బుద్ధి చెబుతారు..
తెలంగాణ ప్రజలను మోసం చేసి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాడని ‘రూ. 500కు గ్యాస్ ఎంతమందికి ఇస్తున్నావు, ఉచిత కరెంటు ఎంతమందికి ఇస్తున్నావు, నాలుగు వేల పెన్షన్ ఎక్కడ పోయింది, తులం బంగారం ముచ్చటే లేదు, మహిళలకు ఇస్తానన్న రూ.2500 సాయం ఏమైంద’ని ఎర్రబెల్లి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని రేవంత్‌కు వాళ్లే బుద్ధి చెబుతారని.. ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.