మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సఖీ కేంద్రాల ద్వారా బాధిత స్త్రీలకు అండగా నిలుస్తున్నది. గృహ హింస, వరకట్నం, పనిచేసే చోట వేధింపులు, లైంగిక హింస, ఆడపిల్లల అమ్మకం, రవాణా, ఇతరుల నుంచి సమస్యలు ఎదుర్కొనే అతివలు, బాలికలకు భరోసా కల్పిస్తున్నది. మేమున్నామంటూ ఈ కేంద్రాల నిర్వాహకులు ధైర్యం చెబుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తూ, అవసరమైన వారికి పోలీసు, న్యాయ సేవలు ఉచితంగా అందిస్తూ కష్టాల కడలి నుంచి ఒడ్డుకు చేరుస్తున్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చినా హెల్ప్‌లైన్ నంబర్ 181లో సంప్రదించాలని సూచిస్తున్నారు.
పోచమ్మమైదాన్, ఏప్రిల్ 30 : సమాజంలోని బాధిత మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ సెంటర్లు అండగా నిలుస్తున్నాయి. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా తామున్నామంటూ సెంటర్ల నిర్వాహకులు ఉచిత సేవలు అందిస్తూ ఆశ్రయం కల్పిస్తున్నారు. తాత్కాలిక వసతి, పోలీసు, న్యాయం, వైద్యం అందిస్తూ నిరాశ్రయులకు తోడుగా ఉంటున్నారు. గృహ హింస, వరకట్నం, పనిచేసే చోట వేధింపులు, లైంగిక హింస, ఆడపిల్లల అమ్మకం, రవాణా, ఇతరుల నుంచి సమస్యలకు గురయ్యేవారికి సఖీ సెంటర్ (వన్ స్టాఫ్ సెంటర్) ద్వారా రక్షణతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఇక్కడ కాని పక్షంలో పోలీసులు, న్యాయ సేవలు సైతం ఉచితంగా అందిస్తున్నారు. ఆపద సమయంలో 181 హెల్ప్‌లైన్ ఫోన్ చేయాలని చెబుతున్నారు.
వరంగల్ జిల్లాలో డిసెంబర్ 2019 నుంచి మహిళాభివృద్ధి, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ సహకారంతో వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సమీపాన సఖీ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అద్దె భవనంలో ఉండగా, సొంత భవనాన్ని ఆటోనగర్ రోడ్డులోని జువైనల్ హోంలో నిర్మిస్తున్నారు. మహిళలు, యువతులు, బాలికలకు ఎక్కడ ఆపద జరిగినా సిబ్బంది తక్షణమే స్పందించి అక్కడికి చేరుకుంటారు. 24 గంటలూ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తుంటారు. అవసరమైన వారికి మెడికల్ ఎయిడ్ సదుపాయం అందిస్తారు. తాత్కాలిక వసతి కల్పించి, భోజనం అందజేస్తారు. అలాగే రూ. 2వేల విలువైన సర్వైవర్ కిట్స్‌ను కూడా ఇస్తారు. తర్వాత అవసరాన్ని బట్టి స్వధార్ హోమ్‌కు పంపిస్తారు. అలాగే మిస్సింగ్ అయిన వారిని బంధువులకు అప్పజెప్పేవరకు బాధ్యత తీసుకుంటారు. గృహ హింస, గృహ నిర్బంధం ఘటనల్లో డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్టు (డీఐఆర్) రాసి జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సహాయాన్ని అందిస్తారు. చట్ట ప్రకారం సేవలు అందిస్తూ, ఖర్చును కూడా భరిస్తారు. సమస్యలు పరిష్కారమై ఇంటికి చేరుకున్న త ర్వాత ఎలా ఉంటున్నారో అని ఆరు నెలలు పర్యవేక్షిస్తారు.
పలు కేసుల పరిష్కారం…
ఇప్పటివరకు 1,231 కేసులు రాగా, ఇందులో 1,133 కేసులు పరిష్కారమయ్యాయి. ఇంకా 98 ప్రాసెస్‌లో ఉన్నాయి. 72 కేసులు కోర్టులో ఉన్నాయి. అలాగే 289 మందికి న్యాయ సలహాలు, 338 మందికి వైద్య సేవలు, 50 మందికి సర్వైవర్ కిట్స్, 190 మందికి తాత్కాలిక వసతి కల్పించారు. 44 మందిని రెస్క్యూ చేశారు. అలాగే, ఆపదలో ఉన్నవారు తప్పనిసరిగా 100 గాని 181 సెల్ నంబర్లకు ఫోన్ చేయాలంటూ సఖీ సెంటర్ సిబ్బంది విరివిగా ప్రచారం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ైరైల్వే, బస్ స్టేషన్లలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వివరిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, పోలీసు, రెవెన్యూ కార్యాలయం, కౌన్సిలర్, కార్పొరేటర్ ఆఫీసుల వద్ద కరపత్రాల ప్రచారాన్ని సాగిస్తున్నారు.
ఎల్లప్పుడు అండగా ఉంటాం..
ఎలాంటి సమస్యలు ఉన్నా 181 నంబర్‌కు కాల్ చేయండి. మీకు కావాల్సిన రక్షణ బాధ్యతలను తీసుకుంటాం. సెంటర్లో 24 గంటలు 14 మంది సిబ్బంది, రెస్క్యూ టీం అందుబాటులో ఉంటుంది. ఆపదలో ఉన్న బాధితులకు అవసరమైన న్యాయం, వైద్యం, ఇతర సేవలను ఉచితంగా అందిస్తాం. ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వల్లె శ్రీలత, అడ్మినిస్ట్రేటర్, వరంగల్ సఖీ సెంటర్