వరంగల్ : వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. గ్రేటర్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కమిషనర్‌కు పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీవో రమేశ్, బల్దియా సీఎంహెచ్వో రాజేశ్, హెచ్‌వో రమేశ్, డీపీఆర్వో అయూబ్ అలీ, కుడా సీపీవో అజిత్‌రెడ్డి, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు కృష్ణారెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.
సుబేదారి : హనుమకొండలోని పోలీసు కమిషనరేట్‌లో సీపీ అంబర్ కిశోర్ ఝా కేక్ కట్ చేసి, పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 2024లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. డీసీపీలు అబ్దుల్ బారి, రవీందర్, సీతారాం, అదనపు డీసీపీలు రాగ్యానాయక్, సంజీవ, సురేశ్ పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : న్యూ ఇయర్ వేడుకలను హనుమకొండలోని ప్రెస్‌క్లబ్‌లో అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్లబ్ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులకు స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. టీయూడబ్ల్యూజే ఐజేయూ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు.
హనుమకొండ : హనుమకొండ టీజీవో భవన్లో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అలాగే, పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. టీజీవో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగన్మోహన్రావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, ఫణి కుమార్, ప్రవీణ్ కుమార్, కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
పరకాల/ఆత్మకూరు : పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఆత్మకూరులోని వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య దర్శించుకున్నారు. మొదటిసారి ఆలయానికి విచ్చేసిన రేవూరికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అలాగే, ఆత్మకూరులోని జీజేఎం పెంతెకొస్తు చర్చిలో ఎమ్మెల్యే రేవూరి పాల్గొని పాస్టర్‌తో కలిసి కేక్ కట్ చేశారు.
నెక్కొండ : మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి సంబురాలను నిర్వహించారు. కార్యక్రమంలో నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్‌యాదవ్, సొసైటీ మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి టీ శివకుమార్,ఉప సర్పంచ్ వీరభద్రయ్య, తాళ్లూరి తిరుపతి, జే వేణు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ : నూతన సంవత్సరం సందర్భంగా పోచమ్మమైదాన్‌లోని ఐపీసీ క్రీస్తుపురం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆరాధన నిర్వహించి, కేక్ కట్ చేసి బైబిల్లోని అంశాలపై సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో పాస్టర్ సామ్యేల్, కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు.