వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 2 : శాస్త్ర, సాంకేతికతతోనే మానవ జీవితం ముడిపడి ఉందని ఉమ్మడి వరంగల్, కరీంనగర్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ కో ఆర్డినేటర్ డీఎస్ వెంకన్న అన్నారు. శుక్రవారం తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఇగ్నైట్ ఫెస్ట్ అండ్ రీజినల్ సైన్స్‌ఫేర్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
అనంతరం ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించిన వారి భవిష్యత్ అద్భుతంగా ఉంటుందన్నారు. అలాంటి వారిలో శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు వరుసలో ఉంటారని చెప్పారు. రీజినల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ నెల చివరి వారంలో నర్సంపేట అశోక్‌నగర్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్‌కు అర్హులని తెలిపారు. మొత్తం 66మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని 11 రెసిడెన్షియల్ స్కూళ్ల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.