జనగామ చౌరస్తా, అక్టోబర్ 14 : తన ఇద్దరు కుమారుల కుటుంబాలు ఆస్తులు పంచుకొని పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు మంగళవారం జనగామ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌ను వేడుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామానికి చెందిన కొండం లక్ష్మి-లక్ష్మారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
వీరికున్న 30 ఎకరాల వ్యవసాయ భూమిని పెద్ద కొడుకు రమణారెడ్డికి, చిన్న కొడుకు ఇంద్రారెడ్డికి 15 ఎకరాల చొప్పున పంచి ఇచ్చారు. సుమారు 30 ఏళ్ల క్రితం లక్ష్మారెడ్డి మృతి చెందగా, చిన్న కొడుకు ఇంద్రారెడ్డి అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితం చనిపోయారు. పెద్ద కొడుకు రమణారెడ్డి భార్యాబిడ్డలతో కలిసి ఊళ్లోనే ఉంటుండగా, చిన్న కొడుకు కుటుంబసభ్యులు స్టేషన్‌ఘన్‌పూర్‌లో నివాసముంటున్నారు.
వృద్ధురాలు లక్ష్మి ప్రస్తుతం పక్షవాతంతో బాధపడుతుండగా ఆమెకు దగ్గరుండి సపర్యలు చేయాల్సిన కుటుం బీకులెవరూ పట్టించుకోవడం లేదు. ఊళ్లో ఉన్న సొంతింట్లో ఒక గదిలో ఒంటరిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే రూ.2 వేల ఆసరా పింఛన్‌తో కాలం వెళ్లదీస్తున్నట్లు వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. స్పందించిన అదనపు కలెక్టర్ వృద్ధురాలికి తగిన న్యాయం అందించాలని ఆర్డీవో గోపీరామ్కు ఉత్తర్వులు జారీ చేశారు.