ములుగు రూరల్, ఆగస్టు 28 : ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో అద్దె భవనంలో కొనసాగుతున్న ఏటూరునాగారం తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ర్యాగింగ్ కలకలం స్పష్టించింది. ఇద్దరు జూనియర్లపై సీనియర్ విద్యార్థులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరగగా గురువారం వెలుగులోకి వచ్చింది.
బాధిత విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏటూరునాగారం, వాజేడు మండలాలకు చెందిన విద్యార్థుల్లో ఒకరు ఎంపీసీ, మరొకరు బైపీసీ చదువుతున్నారు. ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం సాయంత్రం ర్యాగింగ్ పేరిట ఇద్దరిపై కర్రలు, ఇనుప చువ్వలు, కిటికీ రాడ్లతో దాడి చేశారు.
గురుకులంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, వార్డెన్ లేకపోవడంతో బాధితులు బయటకు పరుగులు తీసి బస్సులో ములుగుకు, అక్కడి నుంచి అదే రాత్రి వారి ఇళ్లకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో గురువారం ములుగు పోలీస్ స్టేషన్లో ముగ్గురు విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. అలాగే కలెక్టర్ స్పందించి ప్రిన్సిపాల్‌తో పాటు డ్యూటీలో ఉన్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.