వరంగల్ చౌరస్తా, ఆగస్టు 2 : పేద ప్రజలకు పెద్ద దిక్కయిన వరంగల్ ఎంజీఎం దవాఖానలో వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఉద్యోగులు, కాంట్రాక్టు నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తుండడంతో అంతా అయోమయంగా మారింది. రోగాన్ని నిర్ధారణకు పారా మెడికల్, రేడియాలజీ పరీక్షలు ముఖ్యమైనవి. మనిషి గుండె పనితీరు గుర్తించేందుకు ఈసీజీ అవసరం. నిర్దేషిత విద్యార్హతలున్న వారే వీటిని నిర్వహించాలి. దీనిని పక్కన పెట్టి, రాజకీయ నాయకులు, అధికారులు సూచించిన వారిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకొని టెక్నికల్ పనులు చేయిస్తున్నారు.
ఆస్పత్రి అవసరానికి అనుగుణంగా విధంగా సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బందిని నియమించుకుంటున్న సదరు కాంట్రాక్టర్ వారిని టెక్నికల్ విధుల్లోకి పంపిస్తున్నారు. దాంతో అసలు పనులు పక్కన పెట్టి అధికారులు, కాంట్రాక్టు సంస్థ సూచించిన పీఆర్వో, డీటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇటీవల ఓ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తిని పేషెంట్ కేర్‌లో తీసుకొని, ఈసీజీ టెక్నీషియన్ పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఎంజీఎంహెచ్‌లో 675 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విధులు నిర్వర్తించాల్సి ఉంది. అయితే వీరిలో 50 మందిని టెక్నికల్, మరికొంత మందిని ఇతరత్రా విభాగాల్లో పనులకు పంపిస్తున్నారు. దీంతో సానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న వారిపై అదనపు పని ఒత్తిడి పడుతున్నది.
సేవల్లో లోపాలు..
ఎంజీఎంహెచ్‌లో టెక్నికల్ పోస్టులను 300 ఓసీఎస్ విధానంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి భర్తీ చేయాల్సి ఉంటుంది. దీనిని పక్కనపెట్టి అర్హతలు, నైపుణ్యం లేని వారిని ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకొని టెక్నికల్ విధులు అప్పగిస్తుండడంతో సేవల్లో నాణ్యత లోపిస్తున్నది. తూతూ మంత్రంగా రిపోర్టులు ఇస్తుండడంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఇక్కడి రిపోర్టులతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే వాటి ఆధారంగా వైద్యం చేయలేమని అక్కడి వైద్యులు చెప్తుండడం గమనార్హం. ఎంజీఎంలో ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలా అర్హతలేని వారితో పనులు చేయించుకోవడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పోతుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మూతపడిన సర్కారు బడులు
విద్యార్థులు లేకపోవడంతో అధికారుల నిర్ణయం
ఇది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఫ్రూట్ ఫామ్ గ్రామంలోని ఎస్జీటీ పాఠశాల. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బడిని విద్యార్థులు రావడంలేదని అధికారులు మూసివేశారు. కనీసం ఐదుగురు విద్యార్థులు కూడా లేకపోవడంతో మండలంలోని మరో ఐదు గ్రామాలైన బాలాజీనగర్, పాపయ్యపల్లి, పోచంపల్లి, చంద్రుతండా, పాతనాగారంలోని స్కూళ్లను కూడా మూసివేసి అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు పంపించారు. ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసి బలోపేతం చేస్తున్నామని చెబుతున్న క్రమంలో వీటిని మూసివేయడం గమనార్హం.
– గోవిందరావుపేట, ఆగస్టు 2