నర్మెట, నవంబర్ 13: విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో రసాయన శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు కర్ణాకర్ కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని పిల్లలు తల్లిదండ్రులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి ఐలయ్య, ఎస్సై నాగేశ్ పాఠ శాలకు వచ్చి విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఓ మహిళా ఉపాధ్యాయురాలిని విద్యార్థినులతో మాట్లాడించి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ పుష్పకుమారి, ఎంఈవో ఐలయ్య మాట్లాడుతూ తల్లిదండ్రుల ఫిర్యాదుతో జిల్లా విద్యా శాఖ అధికారితో పాటు విద్యాశాఖ డైరెక్టర్, ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.