జనగామ, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : స్టేషన్‌ఘన్‌పూర్ శివారు మీదికొండ క్రాస్‌రోడ్డులోని శివారెడ్డిపల్లిలో సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ జనజాతరను తలపించింది. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, రెపరెపలాడుతున్న జెండాలతో వరంగల్-హైదరాబాద్ హైవే గులాబీ వనమైంది. సభ మధ్యా హ్నం 2గంటలకు ఉండగా 11గంటల నుంచే జనం భారీగా వచ్చి చేరడంతో 12గంటలకే సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. సభాస్థలిలో ఎంతమంది ఉన్నారో.. బయట అంతకు రెట్టింపు కనిపించారు. కులవృత్తుల వేషధారణలు, ఒగ్గుడోలు విన్యాసాలు, చిందు యక్షగాన కళారూపాలు, గిరిజన లంబాడీ మహిళల నృత్యాలు, గొల్లకుర్మల డిల్లెం బల్లెం.. ఇలా సబ్బండ వర్గాల ప్రజలు సమూహాలుగా బయల్దేరి నృత్యాలు చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మహిళలు, యువతులు వాటర్ ప్యాకెట్లు పైకి జల్లుతూ నృత్యం చేశారు.
హెలిక్యాప్టర్ చేరుకోగానే చుట్టూ ఉన్న ప్రాంతంలో నిలబడిన మహిళలు, పిల్లలు, వృద్ధులు కేసీఆర్‌కు అభివాదం చేశారు. ‘కేసీఆర్.. కేసీఆర్.. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్’ అంటూ కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై కళకారులు తమ ఆటాపాటలతో సభికులను హోరెత్తించారు. ‘గులాబీ జెండలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్క’ పాటలతో జనమంతా ఉత్సాహంతో ఊగిపోయారు. అలాగే కేసీఆర్ ప్రసంగం వినేందుకు జనం పోటెత్తారు. ‘ఓటు అనేది ప్రజల తలరాతను, తెలంగాణ భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుందని, ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ చెప్పినప్పుడు ప్రజలు శ్రద్ధగా విన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ బహిరంగ సభ ఊహించిన దానికంటే సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో అటు నాయకులు, ఇటు కార్యకర్తల్లో నయా జోష్ నింపింది. వరాల జల్లు కురిపిస్తారని, కొత్తగా అభివృద్ధి ఫలాలు ప్రకటిస్తారని ఎప్పటినుంచో గంపెడాశతో ఎదురుచూసిన ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు శుభవార్తలు చెప్పడంతో ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు.
స్టేషన్ ఘన్పూర్ : ‘రాజకీయ జన్మనిచ్చిన ఈ నియోజకవర్గ ప్రజలు గత 30ఏండ్లుగా నన్ను ఆశీర్వదిస్తూ ఉమ్మడి రాష్ట్రంలోనే నా కంటూ ఓ గుర్తింపునిచ్చారు. ఎన్ని జన్మలెత్తినా, ఎంత అభివృద్ధి చేసినా ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేను. ప్రజలు నాకు రాజకీయ జన్మనిస్తే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు నా పరిధిలో చేతనైన కృషి చేశా. నిజాయితీగా పనిచేశా. ఏ ఒక్కరినీ నేను మోసం చేయలేదు. రోజూ ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఇందుకు సీఎం కేసీఆర్‌కు తలవంచి నమస్కరిస్తున్నా. కేసీఆర్ ఆశీర్వదించారు, నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడుతా. తెలంగాణలో ఏ పార్టీ చేయని విధంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కచ్చితంగా మూడోసారి కేసీఆరే సీఎం అవుతారు’ అని బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెప్పారు.