స్టేషన్ ఘన్పూర్, జనవరి 12 : సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, నియోజకవర్గానికో స్టేడియం, గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని చాగల్లులో కడియం ఫౌండేషన్ సహకారంతో స్వాగత్ యూత్ ఆధ్వర్యంలో 15వ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.
అనంతరం సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పోగుల సారంగపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకే రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో 40 ఏళ్లలోపు ఉన్న 50 శాతం యువత భవిష్యత్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
కేంద్రం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ కంపెనీలు ప్రో కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నాయని విమర్శించారు. కబడ్డీ క్రీడలకు పెట్టింది పేరు చాగల్లు గ్రామమని, కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ టీమ్‌కు కడియం ఫౌండేషన్ తరఫున రూ. లక్ష, స్వాగత్ యూత్ ఆధ్వర్యంలో ద్వితీయ బహుమతి రూ.50వేలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ సీతారాం, కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ వై కుమార్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, సీఐ అల్లె రాఘవేందర్,
బీఆర్ఎస్ జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, చింతకుంట్ల నరేందర్ రెడ్డి, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య, రైతు బంధు సమితి జిల్లా బాధ్యుడు మారజోడు రాంబాబు, మాజీ సర్పంచ్ ఆకుల నర్సయ్య, స్వాగత్ యూత్ ప్రెసిడెంట్ కూన రాజు, ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్, కోశాధికారి చింతకింది సుధాకర్, అన్నెపు కొమురెళ్లి, దోమల రమేశ్, కత్తెరసాల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.