హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 28: వరంగల్ జాతీయ సాంకేతిక కళాశాల(నిట్)లో సాంస్కృతికోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ-25) శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలోని వివిధ నిట్ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులతో సందడిగా మారింది. వీరు నేటి నుంచి సంగీతం, నృత్యం, నాటకం, ఇతర సాంసృతిక పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం ఆడిటోరియంలో పద్మశ్రీ, సినీ హాస్యనటుడు డాక్టర్ కే బ్రహ్మానందం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం స్పీచ్ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ, వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించే గొప్ప వేదికగా స్ప్రింగ్ స్ప్రీ-25 నిలుస్తుందన్నారు. విద్యార్థులు తమ విశేష ప్రతిభను ప్రదర్శించి వరంగల్ నిట్ ఖ్యాతిని మరింత పెంచాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ డీ శ్రీనివాసచార్య, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పీ శ్యామ్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ (సాంసృతిక) ప్రొఫెసర్ బీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు.. శాల్తీ లేచిపోతుంది..’ అంటూ పద్మశ్రీ, హాస్య నటుడు బ్రహ్మానందం విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. చాలా పేదరికం నుంచి తాను వచ్చానని, ఆరుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లను అప్పుడు చదివించాలంటే చాలా కష్టపడేవారని, ఎన్నో అడ్డంకులు, అవ హేళనను ఎదురొని ఈ స్థాయికి వచ్చానన్నారు. ప్రస్తుత సమాజం నీ దగ్గర డబ్బు ఉంటేనే గౌరవం ఇస్తుందని, అందుకే కృషి, పట్టుదల, సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులు అనుకున్నది ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
40 ఏళ్ల సినీ పరిశ్రమలో 1200కు పైగా చిత్రాల్లో నటించానని, ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు తీసిన వ్యక్తిగా నిలిచిపోయానన్నారు. ఆశీర్వదించడానికి, అభినందించడానికి వయసు ముఖ్యం కాదని, మంచి మనస్సు ఉండాలని నిట్ విద్యార్థుల ఆశీస్సులు తీసుకుందామని ఆరోగ్యం సహకరించకపోయినా వారి కోసం వచ్చినట్లు చెప్పారు. అందరూ బ్రహ్మా‘ఆనందంగా’ ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రముఖ దర్శకుడు వశిష్ట(బింబిసార, విశ్వంభర చిత్రాల దర్శకుడు) తన సినీ ప్రయాణం, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. గొప్ప దర్శకులుగా ఎదగాలని వారిని ప్రోత్సహించారు. విద్యార్థులు, అభ్యాసకులు రూపొందించిన షార్ట్‌ఫిల్మ్స్‌పై వశిష్ట అభిప్రాయాలు వ్యక్తం చేసి, అభ్యాసకులకు మార్గనిర్దేశం చేశారు.