గిర్మాజీపేట, మార్చి 3 : జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,08,937 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 33,981 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 21,243 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇచ్చామన్నారు. శుక్రవారం వరకు 5,200 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసులు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 100 జీపీలు, 26 వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తయ్యాయని, మరో 25 పంచాయతీలు, 19 వార్డుల్లో త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. 97,881 మంది పురుషులు, 1,10,946 మంది స్త్రీలకు పరీక్షలు చేశామని ఇందులో 30,735 ఎస్సీలు, 21,392 ఎస్టీలు, 1,41,796 బీసీలు, 9,056 ఓసీలు, 5,956 మైనార్టీలు, 40 ఏండ్లలోపు వారు 4,453 మంది, 40 ఏండ్ల పైబడిన వారు 29,528 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. 1,53,712 మందికి కంటి సమస్యలు లేవని తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
కంటివెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు అందూ రుణపడి ఉంటారని 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పనానవీన్ అన్నారు. పిన్నావారివీధి సువర్ణ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో దేశాయిపేట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ భరత్‌కుమార్, కంటివెలుగు ఎంవో సాఫురా, ఆప్తమాలజిస్ట్ చంద్రకళ, సూపర్వైజర్ చంద్రకళ, ఎంఎన్‌వో రామా రాజేశ్‌ఖన్నా, ఏఎన్ఎంలు సులోచన, కోమల, డేటా ఎంట్రీ ఆపరేటర్ శృతి, ఆశ కార్యకర్తలు అనిత, మారియా, నజియా పాల్గొన్నారు.
నర్సంపేటలో..
నర్సంపేట రూరల్ : మండలంలోని 18 సంవత్సరాలు దాటిన వారంతా కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎంపీడీవో ఓరుగంటి ఇంద్రసేనారెడ్డి కోరారు. మండలంలోని కమ్మపల్లి, గురిజాల గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను పరిశీలించారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడిశాల మమత-సదానందంగౌడ్, డాక్టర్ సరోజ, క్లస్టర్ టీఏ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి డక్క రాజమౌళి పాల్గొన్నారు.