రేగొండ, మార్చి 1 : కోరినవారి కొంగు బంగారం కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి. నిష్టతో నమ్మి కొలిచిన భక్తుల కష్టాలు తీర్చడం స్వామి వారి ప్రత్యేకత. ప్రతి ఏటా మార్గశుద్ధ దశమి గురువారం నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రా రంభమై వారం రోజల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కొడవటంచ క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతోంది. మానసిక రుగ్మతలను పారదోలుతూ కోరి మొక్కిన వారి కష్టాలను తీరుస్తుండడంతో రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 2న బ్రహ్మోత్సవాల ప్రారంభం, 3న స్వామి వారి కల్యాణం, 4న గజవాహన సేవ, నిత్య పూజలు, 5న సింహవాహన సేవ, 6న హనుమంతు సేవ, 7న జాతర ప్రారంభం, బోనాలు తిరుగడం, పెద్ద రథోత్సవం, 8న జాతర సేవలు, మొక్కుబడులు, 9 న రాత్రి అభిషేకం, నాగబలి, జాతర ముగింపు. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుంచి, స్వామివారి సేవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎక్కడా లేని విధంగా త్రికాల ఆరగింపు కేవలం కొడవటంచ ఆలయంలో నిర్వహించడం ప్రత్యేకత. సమానత్వానికి సూచికగా భక్తులను కోర్చోబెట్టి స్వామివారి ప్రసాదాన్ని అందిస్తారు.
మానసిక వ్యాధులతో బాధపడేవారు స్వామిని కొలిస్తే బాధలు తీరుతాయని నమ్మ కం. సంతానం లేని వారు 40 రోజలపాటు ఉదయం సాయంత్ర స్వామి వారిని దర్శించుకొని సాంబ్రాని పొగ వేసుకోవడం వల్ల సంతనవంతులవుతారని భక్తులు విశ్వసిస్తారు. కోరికలు నెరవేరిన భక్తులు స్వామి వారికి ఏనుగు, మేక, గుర్రం ప్రభ బండ్లు కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలతో మొక్కులు చెల్లించుకుంటారు.
జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. స్వామి వారిని దర్శించుకోవడానికి బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాట్లు చేశాం. పారిశుధ్య పనులు, స్నానఘట్టాలు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశాం. విశ్రాంతి గదుల నిర్మాణంతో పాటు ఆలయ ఆవరణ చుట్టూ సీసీ రోడ్లు నిర్మించాం. రూ.75 లక్షలతో నూతన కల్యాణ మండపం, యాగశాల, గోశాల, రూ.కోటితో ఆలయ పునర్ నిర్మాణ పనులు చేపట్టాం. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి జాతరను విజయవంతం చేయాలి. – మాదాటి అనిత, ఆలయ చైర్మన్
నేటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహించునున్న లక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. స్వామివారిని వెనువెంటనే దర్శించుకునేలా ప్రత్యే క ఏర్పాట్లు చేశాం. తాగునీటి సరాఫరా, ఆర్టీసీ బస్సు సౌకర్యం, విద్యుత్, వైద్య, పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాట్లు చేస్తున్నాం.
– బిళ్ల శ్రీనివాస్, ఈవో