పోచమ్మమైదాన్, మార్చి 9: సాంస్కృతిక వారసత్వం కలిగిన ఓరుగల్లు కళలకు కాణాచిగా వెలుగొందుతున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో తెలుగు భాషా ఆహ్వాన నాటక పోటీలను శనివారం రాత్రి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కళలకు నిలయమైన వరంగల్ ప్రత్యేకతను కాపాడుతూ కళాకారుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. అలాగే, కళాక్షేత్రాన్ని సర్వహంగులతో త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. పారితోషిక దాతలు మల్లెల రవీంద్రశర్మ, పాలాయి శరత్, సంతోష్ ప్రసంగించగా, సాంస్కృతిక కార్యదర్శి వనం లక్ష్మీకాంతారావు కళా నివేదికను సమర్పించారు.
అలరించిన ప్రదర్శనలు
మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘లక్ష్మణరేఖ దాటితే’ నాటికను ప్రదర్శించారు. ఎస్ఎం భాషా దర్శకత్వంలో సాగిన నాటిక అద్భుతంగా ప్రదర్శించారు. ఆనాడు సీత లక్ష్మణరేఖ దాటి ఒక తప్పు చేస్తే.. దాని పర్యవసానం పెద్ద సాహసాలు, పెద్ద యుద్ధాలు, రాక్షస సంహారం జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. మానవ సం బంధాలన్నీ పెడదారి పట్టడానికి, ఆదర్శంగా ఉండాల్సిన కుటుంబ వ్యవస్థ కుంటుపడటానికి నేడు స్మార్ట్ఫోన్లే మూల కారణమవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్‌లతో నేటి సమాజం ఎటుపోతున్నదో తెలియని అయోమయాన్ని సృష్టిస్తూ సమకాలీన వ్యవస్థకు ప్రతిబింబిస్తుంది.
ఆకట్టుకున్న ‘కౌసల్యా సుప్రజా రామా’
ప్రముఖ సినీ, బుల్లితెర నటుడు గోపరాజు విజయ్ దర్శకత్వంలో శ్రీసాయి ఆర్ట్స్ కులకలూరివారి ఆధ్వర్యంలో కౌసల్యా సుప్రజా రామా నాటికను ప్రదర్శించారు. మానవ విలువలకు ప్రాధాన్యం ఇస్తూ నాటిక ఆద్యంతం అందరినీ అలరించింది. ఇందులో సురభి ప్రభావతి అద్భుత నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నది. కార్యక్రమంలో సహృదయ బాధ్యులు కుందావఝుల కృష్ణమూర్తి, ఎం.రాధాకృష్ణ, డాక్టర్ ఎన్వీఎన్ చారి, పందిళ్ల అశోక్‌కుమార్, లక్ష్మణ్‌రావు, సీతా వెంకటేశ్వర్లు, జూ లూరి నాగరాజుతోపాటు స్థానిక కళాకారులు, సాహితీవేత్తలు, కవులు పాల్గొన్నారు. కాగా, ఈ నాటిక ప్రదర్శనలు 12వ తేదీ వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.