ఏటూరునాగారం/కొత్తగూడ, మే 28 : వరద ఉధృతికి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల-కొండాయి మధ్యనున్న జంపన్నవాగుపై, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెం వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్లు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తెగిపోయాయి. రెండేళ్ల క్రితం వచ్చిన వరదలకు జంపన్నవాగుపై ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోగా, అప్పటి నుంచి వర్షాకాలంలో రవాణా సౌకర్యం కష్టంగానే ఉన్నది. గతేడాది ఐరన్ ఫుట్ బ్రిడ్జి నిర్మించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.
మినీ జాతర సందర్భంగా తాత్కాలిక రోడ్డు నిర్మించగా, అది కొండాయి, మల్యాల గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండగా అది కాస్తా తెగిపోయింది. దీంతో మల్యాల, కొండాయి, ఐలాపూర్ గ్రామాల రవాణా స్తంభించింది. నిత్యావసర సరుకులు, వైద్యం కోసం రావాలంటే గిరిజన గ్రామాల ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా వాగు దాటేందుకు అగ్నిమాపక అధికారులు ఇంజిన్ బోటును సమకూర్చారు. వాగు వద్ద ప్రమాద హెచ్చరిక ఫ్లెక్సీ పెట్టారు.
వాగు ఉధృతిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు ఎంపీవో కుమార్ తెలిపారు. అలాగే కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెం వాగుపై బ్రిడ్జి నిర్మాణంలో ఉండగా, తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఐదు గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. ప్రయాణికులెవరూ ఇక్కడి నుంచి ప్రయాణించకుండా ఎంచగూడెం మీదుగా వెళ్లాల్సిందిగా కాంట్రాక్టర్ తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో ఉండడంతో సిమెంట్, ఇతర వస్తువులు, మోటర్లు వాగులో కొట్టుకపోయాయని, సుమారు రూ. 15లక్షల వరకు నష్టం వాటిల్లిందన్నారు.