హనుమకొండ జిల్లాలో యూరియా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల వద్ద కుటుంబ సమేతంగా రైతులు బారులు తీరుతున్నారు. మనిషికి ఒక బస్తా అయినా రాకపోతుందా అని రోజుల తరబడి వ్యవసాయ పనులు వదులుకొని మరీ నిరీక్షిస్తున్నారు. తీరా లైన్ దగ్గరకు వచ్చే సమయానికి యూరియా అయిపోయిందని చెబుతుండడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. రోజుల తరబడి కుటుంబమంతా యూరియా కోసం పడిగాపులు పడుతున్నా పట్టించుకునే వారే లేరంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిధిలో అధికార పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలున్నా వారికి తమ కష్టాలు కనిపించడం లేదంటూ మండిపడుతున్నారు. సాగుకు దూరమై.. పంటలు ఆగమై ఇబ్బందులు పడుతున్నామంటూ అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
– హనుమకొండ సబర్బన్, సెప్టెంబర్ 4
హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం వరి పంట చిరు పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో తప్పని సరిగా యూరియా, పొటాష్ చల్లాల్సి ఉంటుంది. సకాలంలో ఎరువులు అందక పొలాలు ఎర్రబారుతున్నాయి. పత్తి, మక్కజొన్న పంటలదీ అదే పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేయగా, ఆయా జిల్లాలకు యూరియా కేటాయింపులో ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి హనుమకొండ జిల్లాకు యూరియా కేటాయింపుల్లో భారీ లోటు కనిపిస్తున్నది.
గత ఏడాది ఆగస్టు వరకు 16,237 మెట్రిక్ టన్నులు కేటాయిస్తే, ఈ సారి కేవలం 13,769 మెట్రిక్ టన్నులే ఇవ్వడంతో 2,467 మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడింది. అలాగే ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్‌కు 5,149 మెట్రిక్ టన్నులు, జనగామకు 2,795 మెట్రిక్ టన్నుల లోటుంది. అదే వరంగల్ జిల్లాకు గతం కంటే 885 మెట్రిక్ టన్నులు, ములుగుకు 777, జయశంకర్ భూపాలపల్లికి 2,044 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చింది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాకు 7,172 మెట్రిక్ టన్నులు, నిజామాబాద్‌కు 6,380, వనపర్తికి 5,580, నల్గొండకు 4,032 మెట్రిక్ టన్నులు అదనంగా ప్రభుత్వం కేటాయించింది. ఇలా కొన్ని జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సర్కారు మరికొన్నింటిపై మాత్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. సెప్టెంబర్‌లో సైతం జిల్లాకు 7 వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది.
రైతుల దుస్థితి పట్టని ఎమ్మెల్యేలు
ఎన్నడూ లేనివిధంగా యూరియా కోసం తా ము అల్లాడుతుంటే జిల్లా ఎమ్మెల్యేలు ఎక్కడున్నారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరిధిలో ఉన్న 14 మండలాలకు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నా రు. ఐనవోలు, కాజీపేట, హసన్‌పర్తి మండలాల కు నాగరాజు, దామెర, ఆత్మకూరు, పరకాల, నడికూడకు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కమలాపూర్‌కు పాడి కౌశిక్‌రెడ్డి, ధర్మసాగర్, వేలేరుకు కడియం శ్రీహ రి, హనుమకొండకు నాయిని రాజేందర్‌రెడ్డి, శాయంపేటకు గండ్ర సత్యనారాయణ, ఇక ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు పొన్నం ప్రభాకర్ ఉన్నారు.
ఇందులో కౌశిక్‌రెడ్డి ఒక్కడే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాగా మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌కు చెందిన వారే. ఇందులో పొన్నం ప్రభాకర్ క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఇంత మంది హేమాహేమీలు ఉన్నప్పటికీ జిల్లాలో యూరియా కొరత ఉండడంపై రైతు లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కనీసం రోజుల తరబడి క్యూలో నిల్చుంటూ అరిగోస ప డుతున్నా తమవద్దకు వచ్చిన దాఖలాలు, యూరి యా తెప్పించేందుకు ప్రయత్నాలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.