మహదేవపూర్ (కాళేశ్వరం), మే 7 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతీ పుష్కరాల పనులు నత్తనడకన సాగుతుండడంపై దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు సీరియస్ అయ్యారు. సకాలంలో పనులు పూర్తిచేయకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఆయన పుష్కరాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వీఐపీ, గోదావరి ఘాట్లు, టెంట్ సిటీ, హారతి, పుషర స్నానాల ప్రాంతం, 100 గదుల సత్రం, హెలిప్యాడ్ తదితరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల విషయంలో రేపు అన్న పదమే వాడొద్దన్నారు. గతంలో జరిగిన గోదావరి, కృష్ణా పుషరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు.
మొదటి సారి జాయ్ రైడ్, టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారని కలెక్టర్‌ను అభినందించారు. ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని, చాలా పెండింగ్‌లో ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. రానున్న వారం రోజుల్లో మూడు షిప్టుల్లో పనులు జరగాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ పనులు నత్తనడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీఐపీ ఘాట్ నుంచి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక రోడ్డు కోసం భూములు లీజుకిచ్చిన రైతులను అభినందించారు. పారిశుధ్యం అధ్వానంగా ఉందని, జడ్పీ సీఈవో పర్యవేక్షించాలని ఆదేశించారు.
షవర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, గోదావరి వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మరుగుదొడ్ల పనుల్లో వేగం పెంచాలన్నారు. 12 రోజుల పాటు పండుగ వాతావరణంలో పుషరాలు జరగాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు అందుబాటులో ఉంచాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఇరిగేషన్, పీఆర్, ఆర్ డబ్ల్యూఎస్, దేవాదాయ, ఇంజినీరింగ్ శాఖల విధులు ముఖ్యమైనవని, పుషరాలు పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బందికి సెలవులు లేవన్నారు. కలెక్టర్ అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లొద్దని, అంకితభావంతో పని చేయాలన్నారు. పుష్కరాల సమయంలో ప్రతి రోజు 5 వేల మందికి ఉచిత అన్నదానం చేయాలని దేవస్థానం అధికారులను కమిషనర్ ఆదేశించారు.
5 సెక్టార్లు.. 18 జోన్లు
ఈ నెల 15న సీఎం వస్తున్నారని, సరస్వతీ విగ్రహం ప్రారంభం, పుషర స్నానం, దర్శనం, హారతి కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 5 సెక్టార్లు, 18 జోన్లుగా విభజించి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గోదావరిలో వ్యర్థాలు తొలగించాలన్నారు. నోడల్ అధికారులను నియమించి పనుల పర్యవేక్షణ అప్పగిస్తామన్నారు. వీఐపీ ఘాట్ వద్ద షవర్స్, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలన్నారు.
హారతి, సాంసృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు వీలుగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఎల్ఈడీ స్రీన్స్ ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ కిరణ్‌ఖరే మాట్లాడుతూ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రులు దిశా నిర్దేశం చేశారని, పనుల్లో నాణ్యత పాటించాలని, పనులను పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు