జనగామ, మార్చి 16 (నమస్తే తెలంగాణ)/స్టేషన్‌ఘన్‌పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్‌లో ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ పేరిట తలపెట్టిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డికి నిరసన సెగ తలిగింది. తీవ్రమైన ఎండలో నిర్వహించిన ఈ సభలో మహిళా కళాకారులు డిమాండ్ల సాధన కోసం ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే ఒక్కసారిగా ఫ్లెక్సీ ప్రదర్శించి తమ సమస్యను తెలిసేలా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సాంసృతిక సారథిలో తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ సభకు ముందు కుడివైపున కళాకారులు ఫ్లెక్సీ పట్టుకొని నిల్చున్నారు. ఆ ఫ్లెక్సీని చూసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనానికి గురయ్యారు. ‘ఫ్లెక్సీని చూశాను, ఇక దించండి’ అనగా కళాకారులు కూర్చునేలోపే ఒకసారిగా అక్కడున్న పోలీసులంతా అమాం తం వారిని చుట్టుముట్టారు. దీంతో సభలో ఒకసారిగా గందరగోళం నెలకొన్నది.
ఈ క్రమంలో మహిళా కళాకారుల ఫోన్లను, వారి ప్రదర్శించిన ఫ్లెక్సీని లాక్కున్నారు. మహిళా కళాకారులను పోలీసులు ఈడ్చుకుంటూ సభలో నుంచి బయటికి తీసుకువెళ్లారు. కొందరు మహిళా కళాకారులు చంటి బిడ్డలతో వచ్చారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం పోలీసులు వారితోనూ దురుసుగా ప్రవర్తించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తే ఇలా అమానుషంగా వ్యవహరించారని కళాకారులు ఆవేదనకు లోనయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఉద్యోగాలను ఇవ్వాలని కోరారు.
ఏడాదిన్నర గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలను, అధికారులకు ఎన్నోమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని చెప్పారు. సమస్య చెప్పుకొనేందుకు చాలాసార్లు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగినా స్పందన రాలేదని వాపోయారు. అందుకే నేరుగా తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకే సభలో ఫ్లెక్సీ ద్వారా గుర్తు చేశామని చెప్పారు. వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ కళాకారుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లలతో వచ్చిన తమపైనా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.