హనుమకొండ/ కాజీపేట, జూలై 19 : రైల్యే మల్టీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్(ఆర్ఎంయూ) పనుల్లో వేగం పెంచాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. కాజేపేట రైల్వే జంక్షన్ పరిధిలో ని అయోధ్యపురంలో నిర్మిస్తున్న యూనిట్ షెడ్డు అభివృద్ధి పనులకు పర్యవేక్షించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శనివారం ప్రత్యేక రైలులో షెడ్యూల్ కంటే 1.40 గంటలు ఆలస్యంగా వచ్చారు. కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం నిర్మాణ పనులను పరిశీలించారు. షెడ్డులో పని చేస్తున్న దినసరి కార్మికుల పనులు, సమస్యల గురించి తెలుసుకున్నారు. పనులు బాగానే జరు గుతున్నాయని అధికారులకు కితాబు ఇచ్చా రు. ఈ సంద ర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రూ.500 కోట్లతో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ని ర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని, డిసెంబర్ వరకు సివిల్ పనులు పూర్తి చేసుకొని యూనిట్ ప్రారంభమవుతుందన్నారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల ఓరుగల్లువాసుల కల సాకారమైందన్నారు.
స్థానికంగా భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు పరిహారం, ఉపాధి ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్దని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే ఆర్ఆర్ పాలసీ ప్రకారం ఉపాధి అవకాశాలు పరిశీలి స్తామని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో మంత్రులు అయోధ్యపురం రైల్వే గేట్ వద్దనే రైలును ఆపుకుని స్పెషల్ రైలు ఎక్కి సికింద్రాబాద్కు వెళ్లారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, డీఆర్ఎం భర్తేశ్కుమార్ జైన్, సీపీఎంసీ మధుసూదనరావు పాల్గొన్నారు. కాగా, మంత్రులను తిలకించేందుకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగింది. రైల్వే పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కాజీపేటకు చెందిన కార్యకర్త స్వామి చేయి విరిగింది. మరికొందరికి గాయాలయ్యాయి.