వరంగల్, జూలై 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పెన్ను, పుస్తకం పట్టాల్సిన చేతులు అవి.. పేదకరికంతో చెత్తను ఏరుకుని బతుకుతున్నాయి. బడిలో గడవాల్సిన బాల్యం చెత్త కుప్పల వద్ద ఉంటున్నది. ఆట పాటలతో ఆనందంగా ఉండాల్సిన ఆ పిల్లలు చదువు లేక ఆగమవుతున్నారు. వారికి చీఫ్‌విప్ అండగా నిలిచారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ చెత్త ఏరుకునే పిల్లలకు కొత్త దారి చూపించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చెత్త సేకరిస్తున్న 11 మంది పిల్లలను వారి తల్లిదండ్రులను ఒప్పించి, ప్రభుత్వ గురుకులాల్లో చేర్పించారు. ఈ పిల్లలకు అవసరమైన నోట్‌బుక్స్, పెన్నులను అందించారు. మంగళవారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఈ 11 మంది పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి చీఫ్‌విప్ భోజనం చేశారు. ఆ పిల్లల తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యతను వివరించారు. అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పేద పిల్లలకు ఉచితంగా కేజీ టు పీజీ విద్య అందుతున్నదని చెప్పారు. ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు ప్రభుత్వ గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురుకులంలో చదువుకునే ఒకొక్కరిపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. బాల్యం కచ్చితంగా బడిలోనే గడవాలని, వారితో పని చేయించవద్దన్నారు. చెత్త ఏరుకునే బాలలను గుర్తించి, వారిని బడిలో చేర్పించడంలో సహకరించిన లక్ష్మితోపాటు అడ్మిషన్ల ప్రక్రియలో సహకరించిన మైనార్టీ శాఖ ఈడీ శ్రీనివాస్‌ను చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అభినందించారు.
ఏటా పేద పిల్లలకు చేయూత
నగరంలోని బస్తీల పేద కుటుంబాలు వారి పిల్లలను బడికి బదులుగా పనిలోకి పంపుతున్నారు. చదువుపై అవగాహన లేకపోవడంతో పేదల పిల్లలు దానికి దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితులను చూసిన చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ ఏటా జూన్, జూలైలో బడికి వెళ్లని పిల్లల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా చెత్త ఏరుకుని జీవించే వారి పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు. ఈ ఏడాది ఇలాంటి 11 మంది పిల్లలను గుర్తించారు. వారిని ప్రభుత్వ గురుకులంలో చేర్పించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో ఈసారి 11 మంది పిల్లలు కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నారు.
మంచిగా చదువుకుంట
నాతోటి వాళ్లు అందరూ స్కూల్‌కు పోతరు. నాక్కూడ పోవాలని ఉండేది. రోజు చెత్త తెచ్చి అందులోని వస్తువులు అమ్ముకునేది. సారు గురుకులం చేర్పించిండు. అక్కడే తిండి కూడా ఉంటదట. అక్కడికే పోత. మంచిగ చదువుకుంట.
– రాకేశ్
గురుకులానికి పోత
రోజు పని చేసి వచ్చినంకనే తినుడు ఉండేది. సారు చేర్పించిన బడిల సదువుతోపాటు తిండి కూడ ఉంటుందట. అక్కడే ఉండాలని మా పెద్దోళ్లు చెప్పిండ్లు. గురుకులానికి పోయి అక్కడే ఉంటూ సదువుకుంటా.
– గాయత్రి
వినయన్న స్ఫూర్తి :
నా లాంటి రాగ్ పికర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే వినయన్న అండగా ఉంటున్నరు. మా పిల్లలు చదువుకు దూరంగానే ఉంటున్నరు. ఏటా వినయన్న గుర్తించి, పిల్లలను బడిలో, హాస్టల్లో చేర్పిస్తున్నరు. ఇలాగే, నన్ను కూడా చేర్పించిండు. నేను డిగ్రీ పూర్తి చేసిన. ఇప్పుడు పీజీ చేస్తున్న. ఎస్సై, కానిస్టేబుల్ జాబ్ కోసం ఎగ్జామ్ రాసిన. వినయన్న అండతో మాలాంటి వాళ్లు ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం వచ్చింది.
– పత్రి లక్ష్మి