సుబేదారి, ఆగస్టు 23 : ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్స్, డయాగ్నొస్టిక్స్, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు మాఫియాగా మారిపోయి గ్రామాల్లో ఆర్ఎంపీలను కమీషన్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. వారి ద్వారా రోగులను రెఫర్ చేసుకొని అధిక డబ్బులు దోచుకుంటున్నాయి. వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో పుట్టగొడుగుల్లా కొత్త ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయి. రోగి హాస్పిటల్కు వస్తే చా లు.. రకరకాల పరీక్షలు, వైద్య సేవలు, మందుల పేరు తో పేద, మధ్యతరగతి ప్రజల రక్తం తాగుతున్నాయి. వ్యాధి తీవ్రత లేకున్నా అడ్మిట్ చేసుకొని, స్పెషలిస్ట్ డాక్టర్ల పేర్లతో రోగులను మాయ చేస్తున్నాయి. అర్హత లేని వైద్యులతో చికిత్స అందిస్తూ రూ. లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్లోని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ఈ దోపిడీ అధికంగా, హనుమకొండ పరిధిలో ఇంకొంత ఎక్కువగా ఉంది. కాగా, హనుమకొండ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్లు, డయాగ్నొస్టిక్స్, స్కానింగ్ సెంటర్లు దాదాపు 789 ఉన్నాయి. హనుమకొండ కాకాజీకాలనీ ప్రైవేట్ ఆస్పత్రులకు అడ్డాగా మారడంతో ఉమ్మడి జిల్లా నుంచి రోగులు ఇక్కడికే వస్తుంటారు. అలాగే బాలసముద్రం, ములుగురోడ్డు, నయీంనగర్, పబ్లిక్ గార్డెన్ రోడ్డు, ఎన్జీవోస్కాలనీ రోడ్డు, సుబేదారి, రెడ్డికాలనీ, కేయూసీ, బీమారం, కాజీపేటలోని ప్రైవేట్ దవాఖానలు, క్లినిక్స్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల వసూళ్లకు పాల్పడుతుండగా, కొన్నింటికి వైద్య, ఆరోగ్య శాఖ అనుమతులే లేకపోవడం గమనార్హం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం, సరైన చికిత్స అందక రోగులు చనిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. రోజూ ఏదో ఒకచోట బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలకు రాజకీయ పలుకుబడి ఉన్నందున ఆ శాఖ అధికారులను మామూళ్లతో మేనేజ్ చేసి దోపిడీ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు నిబంధనలు పాటించని ప్రైవేట్ దవాఖానల విషయంలోనూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్స్, డయాగ్నొస్టిక్స్, స్కానింగ్ సెంటర్ల అడ్డగోలు ఫీజుల దోపిడీని నియంత్రిచాల్సించిన అధికారులు ఎక్కడ కూడా తనిఖీలు చేయడం లేదు. ‘మామూలు’గా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలనే డిమాండ్లు పేద, మధ్యతరగతి ప్రజల నుంచి అధికమవుతున్నాయి.

కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలు ఏమాత్రం పాటించడంలేదు. స్పెషలిస్ట్ డాక్టర్ల పేర్లతో అనుమతులు పొంది, ఆ తర్వాత అర్హత లేని వైద్యులతో చికిత్స చేయిస్తున్నారు. డాక్టర్ల పేర్లు, ఫీజుల వివరాలు ఆస్పత్రిలో ప్రదర్శించడంతో పాటు తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కానీ ఖర్చు తగ్గించుకునేందుకు అర్హత లేని, జూనియర్ డాక్టర్లతో పరీక్షలు, సర్జరీలు చేయిస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్లో ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లకు అనుమతి లేనప్పటికీ అర్హత లేని వారితో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని డయాగ్నిస్టిక్స్ సెంటర్లలో సైతం అర్హత లేని టెక్నీషియన్లతో పరీక్షలు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సీజనల్ వ్యాధులను అదునుగా చేసుకొని ప్రైవేట్ ఆస్పత్రులు సాధారణ జ్వరాలకు కూడా టెస్టులు చేసుకోవాలంటూ రోగులను భయానికి గురిచేస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కిడ్నీ, లివర్ తదితర పలు రకాల టెస్టులు చేసి, వ్యాధి తీవ్రత లేకున్నా కండీషన్ సీరియస్గా ఉందంటూ అడ్మిట్ చేసుకొని డబ్బులు గుంజుతున్నారు. ఇక కార్పొరేట్ హాస్పిటల్స్లో అడిగేవారు లేకపోవడంతో వైద్య పరీక్షలు, ల్యాబ్, స్కానింగ్, ఫార్మసీ పేరుతో అంతులేని దోపిడీకి తెగబడుతున్నారు.