సుబేదారి, డిసెంబర్ 20 : వరంగల్ నగరంలోని రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. కొందరు రౌడీషీటర్లు రెచ్చిపోయి భూదందాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ అమాయకులపై దాడులకు తెగబడుతున్న తీరును ‘నమస్తే తెలంగాణ’లో ‘నగరంలో రౌడీల రాజ్యం’, ‘ఆర్డర్ తప్పిన పోలీసు -పోలిటికల్ సపోర్ట్‌తో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు’ శీర్షికన పలు వరుస కథనాల్లో రౌడీల దందాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా నగరంలోని రౌడీ షీటర్ల దందాలపై నిఘా పెట్టారు.
పోలీసులు రాత్రి పెట్రోలింగ్ సమయంలో ర్యాండమ్‌గా ప్రతి రౌడీషీటర్ ఇంటికి వెళ్లి తనిఖీ చేయాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో నగరంలోని మిల్స్‌కాలనీ, ఇంతెజార్గంజ్, మట్టెవాడ, హనుమకొండ, సుబేదారి, కేయూసీ, కాజీపేట, మడికొండ, హసన్‌పర్తి, మామునూరు పోలీసులు ప్రతిరోజు రాత్రి ఒకరిద్దరు రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేస్తున్నారు.
రౌడీల కదలిక లు, దిన చర్యపై ఆరా తీసి కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఈ వివరాలను స్టేషన్ నుంచి రోజువారీ నివేదికల (డీఎస్ఆర్) ద్వారా సీసీ కార్యాలయానికి అందజేస్తున్నారు. ఈ విధానంలో ముగ్గు రు ఇన్స్పెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సీపీ తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 699 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. నగరంలో 234 మంది రౌడీషీటర్లుండగా వీరిలో 70 మంది మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు.