గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తున్నది. పెద్దలే కాదు విద్యార్థులు, మైనర్లూ దీనికి బానిసై పెడదోవ పడుతుంటే అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే.. దొంగ దారిలో సరుకును సరఫరా చేయడం విస్తుగొల్పుతోంది. రాష్ర్టాలు దాటి నగరానికి చేరి సగటున రోజుకో చోట పట్టుబడుతున్నా కళ్లెం వేయాల్సిన ఖాకీలే సరఫరాదారులకు అమ్మిన తీరు విమర్శలకు తావి స్తోంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పెంచికల్‌పేట వద్ద గతంలో తనిఖీల్లో పట్టుబడిన 300 కిలోల గంజాయిలో నుంచి 2 కిలోల సరుకును ఎల్కతుర్తి స్టేషన్ కానిస్టేబుల్ రవి మాయం చేసి తన అల్లుడి ద్వారా నర్సంపేటలో కళాశాల విద్యార్థులకు విక్రయించడం, ఇటీవల తనిఖీల్లో అది పట్టుబడడంతో ఈ గంజాయి దందా విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు రవి ఇంట్లో కూడా కొంత గంజాయిని స్వాధీనం చేసుకొని శుక్రవారం రిమాండ్‌కు తరలించగా, సీజ్ చేసిన గంజాయిని కానిస్టేబుల్ ఒక్కడే తీశాడా? అతడికి ఇంకా ఎవరెవరు సహకరించారా? అందులో అప్పడు పనిచేసిన సీఐ, ఎస్సైల పాత్ర ఏమైనా ఉందా? అనేది తేలాల్సి ఉంది. దొంగల ఆటకట్టించే పోలీసుల్లోనే ఇలా కొందరు దొంగ బుద్ధి చూపడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తుండగా పోలీసు శాఖలో పెద్ద దుమారం రేపుతోంది.
– వరంగల్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌లో అంగోత్ రవి 2022 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా డు. వరంగల్-కరీంనగర్ నేషనల్ హైవేపై పోలీసులు గతంలో తనిఖీలు చేస్తుండగా పెంచికల్‌పేట వద్ద 300 కిలోల గంజాయి పట్టుపడింది. పోలీసులు ఆ గంజాయిని స్వా ధీనం చేసుకున్నారు. తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. పట్టుపడిన గంజాయిలో నుంచి 6 కిలోల సరుకును కోర్టులో శాంపిల్‌గా సమర్పించే పనిని కానిస్టేబుల్‌కు అప్పగించినట్లు తెలిసింది. మార్కెట్లో డిమాండ్ ఉండే గంజాయి వ్యాపారం చేయాలనే ఆలోచన మొదలైంది. రవికి వరుసకు అల్లుడు అయ్యే మనోహర్ 2 కిలోల గంజాయిని తీసుకుని వెళ్లి నర్సంపేట ప్రాంతంలోని ఓ కాలేజీ విద్యార్థులకు విక్రయించాడు.
అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు. అక్కడి పో లీసులు గట్టిగా విచారించడంతో ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవి దగ్గర నుంచి తీసుకున్నట్లు మనోహర్ అంగీకరించాడు. అనంతరం పోలీసులు వరంగల్ నగరం గోపాల్‌పూర్‌లోని కానిస్టేబుల్ రవి ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ కొద్దిగా గంజాయి పట్టుపడినట్లు తెలిసింది. నర్సంపేట పోలీసులు కోర్టు కానిస్టేబుల్ రవిపై కేసు నమోదు చేసి శుక్రవారం రిమాం డ్ చేసినట్లు తెలిసింది. కానిస్టేబుల్ రవి గంజాయిని ఎలా తీసుకువెళ్లాడు, ఈయనకు సహకరించిన పోలీస్ అధికారులు ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఎలతుర్తి పోలీస్‌స్టేషన్‌లో రవి రైటర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ కేసులో పట్టుకున్న గంజాయిని కోర్టులో డిపాజిట్ చూపించిన తర్వాత వరంగల్ పోలీస్ కమినరేట్ కార్యాలయంలో మాల్ఖానా(గది పేరు)లో భద్రపరుస్తారు. పోలీస్స్టేషన్ల వారీగా డిస్పోజల్ కమిటీ ఉంటుంది. పది నుంచి 20కేసుల్లో పట్టుబడిన గంజాయిని మాల్ఖానా నుంచి ఏరియా డిస్పోజల్ కమి టీ ద్వారా జోన్ వారీగా ఎంపిక చేసి కాజీపేట మండలం అమ్మవారిపేటలోని కాకతీయ మె డిక్లిన్ సర్వీస్ బాయిలర్‌లో దహనం చేస్తారు. ఎలతుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుకున్న గంజాయిని మాల్ఖానా నుంచి అమ్మవారిపేటకు దహనానికి తీసుకెళ్తున్న క్రమంలో కొంత సరుకును తీసి అమ్ముకున్నట్లు నారోటిక్ పోలీసులకు కానిస్టేబుల్ రవి వాంగ్మూలంలో చెప్పినట్లు తెలిసింది.
నిజంగా ఇలాగే జరిగిందా? పోలీస్‌స్టేషన్ నుంచే గంజాయి మాయమైందా? అనేది అనునాస్పదంగా ఉ న్నది. గంజాయి కేసు పోలీసు శాఖకు అప్రతిష్ట తెచ్చే పరిస్థితి ఉండడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి ఎప్పుడెప్పుడు పట్టుబడింది? ఆ సమయంలో అక్కడ పనిచేసిన ఎస్సైలు ఇన్స్పెక్టర్లు ఎవరనేది ఆరా తీ స్తున్నారు. గంజాయి కేసుల పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. పోలీస్స్టేషన్లలోని ఉన్నతాధికారుల ప్రమేయం లేనిదే కిందిస్థాయి ఉ ద్యోగి ఇలా చేయకపోవచ్చనే కోణంలో విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గంజాయిని నియంత్రించాల్సిన పోలీసులే మార్కెట్లో సరఫరాకు కారకులుగా మారడంపై పో లీసు శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.