కురవి, జూన్ 12 : బీసీలకు రాజ్యాంగబద్ధంగా సముచిత హక్కులు, వాటా లభించాల్సిందేనన్నది ఈతరం ప్రజా ఉద్యమాల ప్రధాన నినాదమని, ఇందుకోసం సమగ్ర చర్చ, చైతన్యం అవసరమని ఉమ్మడి వరంగల్ జిల్లా జన అధికార సమితి కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ ఐఏఎస్ అధికారి డా. పరికిపండ్ల నరహరి రచించిన ‘ఓబీసీల పోరు బాట’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కురవిలోని ప్రతిష్టాత్మక వీరభద్రస్వామి ఆలయంలో జిల్లా రచయితలు, మానుకోట రచయితల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ పుస్తకం ఆరు రాష్ట్రాల్లో ఆరేళ్లపాటు జరిపిన పరిశోధన ఫలితంగా రూపుదిద్దుకున్నదన్నారు. బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను చర్చిస్తూ – వాటి పరిష్కార దిశగా ఆలోచించేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. రిజర్వేషన్, క్రిమిలేయర్, న్యాయస్థానాల తీర్పుల విశ్లేషణ, బీసీల ప్రస్తుత స్థితిగతులపై గణాంకాలు, ఫీల్డ్ రీసెర్చ్ ఆధారంగా సమగ్ర అధ్యయనం చేయడం జరిగిందన్నారు.
అత్యంత ప్రాధాన్యతగల అంశంగా ఓబీసీ మేనిఫెస్టోను పుస్తకంలో పొందుపరిచినట్లు తెలియజేశారు. ఇది దేశవ్యాప్తంగా ఓబీసీ నేతల సూచనలతో రూపొందిన ప్రజా డిమాండ్ల సమాహారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్. శ్రీనివాస్, సూరత్ వీరన్న, మానుకోట జిల్లా రచయితలు తాళ్లపల్లి యాకమ్మ, గుర్రపు సత్యనారాయణ, బానాల వీరయ్య, దొంగల వెంకటరెడ్డి, వెంపటి విజయరాజ్, పింగళి శ్రీనివాసులు, కోట జనార్ధన్, రేణిగుంట్ల శ్రీదేవి, మాచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.