జయశంకర్ భూపాలపల్లి, జూలై 14 (నమస్తే తెలంగాణ) : జూలై 27 ఆ గ్రామ ప్రజలు మరచిపోలేని రోజు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో జల ప్రళయం ముంచుకొచ్చింది. వారు తేరుకునే సమయానికి నీరు మంచాలు, బెడ్లపైకి చేరింది. ఎటు చూసినా సముద్రాన్ని తలపించేలా వరద. కరెంటు లేదు. అంతా చీకటిమయం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రాణాలు కాపాడుకునేందుకు పిల్లా పాపలతో ఇండ్లపైకి చేరుకున్నారు. పరిస్థితిని గమనించి కొందరు అధికారులకు సమాచారమిచ్చారు.
వారు వచ్చినా వరద ఉధృతికి ఏమీ చేయలేకపోయారు. పలు ఇండ్లు కూలిపోగా, మరికొన్ని శిథిలమయ్యాయి. గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, గంగిడి సరోజన, గడ్డం మహాలక్ష్మి వరదల్లో కొట్టుకుపోయారు. 200కు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. ఇదీ ఆ రోజు మోరంచ వాగు ప్రవాహంలో చిక్కుకున్న గ్రామస్తుల పరిస్థితి. ఈ ఘటన జరిగి ఏడాది గడుస్తున్నా ఆ భయం నుంచి ఇంకా తేరుకోవడం లేదు. మళ్లీ వర్షాకాలం ప్రారంభమవడం, వాతావరణ శాఖ అధికారులు ఎల్లో హెచ్చరిక జిల్లాల్లో భూపాలపల్లిని చేర్చడంతో గ్రామస్తులు గత ఏడాది జలప్రళయాన్ని గుర్తు చేసుకొని ఆందోళన చెందుతున్నారు.
విపత్తులు అనుకోకుండా వస్తాయనేది గతేడాది మోరంచపల్లి గ్రామానికి నేర్పిన పాఠం. ఎప్పుడో పూర్వం వచ్చిన పెద్ద వరద గతేడాది మరోసారి కళ్లముందు నిలిచింది. మళ్లీ వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రామస్తులు గత చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మోరంచతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయాందోళనలకు గురవుతున్నారు.
అధికార యంత్రాంగం గతేడాది జలప్రళయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గ్రామంలోకి వరద నీరు రాకుండా రింగ్ బండ్ ఏర్పాటు చేయాలని, ఈ విషయమై కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రణాళికలు తయారు చేయాలని వేడుకుంటున్నారు. అలాగే కుందయ్యపల్లి, మో రంచపల్లి గ్రామాల మధ్యలో ఉన్న లో లెవల్ కల్వర్టును హై లెవల్‌గా నిర్మించి నీరు సాఫీగా వెళ్లేలా చూడాలంటున్నారు.
భారీ వర్షాలకు గతేడాది జూలై 27 తెల్లవారుజామున గణపసముద్రం మత్తడిపడింది. ధర్మారావుపేటలోని ఊర చెరువు, కర్కపల్లిలోని ఊడుగుల కుంట, వెంకటాపూర్‌లోని మారెడ్డిపేట చెరువు, కొత్తపల్లి దొమ్మటిపల్లి చెరువులు గండిపడి నీరు ఒక్కసారిగా బయటికి రావడంతో మోరంచ ప్రవాహం ఉగ్రరూపం దాల్చి మోరంచ గ్రామాన్ని ముంచేసింది. ప్రస్తుతం ఊర చెరువు రూ.2.25 కోట్లు, ఊడుగుల కుంట రూ.85 లక్షలు, దొమ్మటిపల్లి చెరువు రూ 2.67 కోట్లతో మరమ్మతు ప్రారంభించగా పనులు చివరి దశలో ఉన్నాయి.
మారెడ్డిపేట చెరువు మరమ్మతుకు ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. అయితే మరమ్మతు చేసిన చెరువులు పదిలమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వర్షాకాలంలో చెరువులు నిండితే తట్టుకోగలవా.. మళ్లీ గండిపడితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నాలుగు చెరువులు ఒక్కసారిగా తెగిపోవడం, వరద ఉధృతి ఎక్కువై మోరంచపల్లి గ్రామం మునిగింది. మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.