కరీమాబాద్, డిసెంబర్ 18: వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో గొడవలు కామన్‌గా మారిపోయాయి. నిత్యం ఏదో పనిమీద వెళ్లిన తమ భర్తో.. లేక కుమారుడో క్షేమంగా ఇంటికి చేరేలా దీవించు దేవుడా అంటూ వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తమ తప్పు లేకున్నా ఇబ్బందులు పడుతున్నవారు కొందరైలే.. ఇదెక్కడి అన్యాయం అంటూ అడిగిన వారిని సైతం కొందరు వ్యక్తులు కర్రలు, కత్తులతో దాడులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన పలు ఘటనలను పరిశీలిస్తే ఎవరిపై ఎక్కడ దాడి జరుగుతుందో.. ఎవరి వద్ద ఎలాంటి కత్తులు ఉన్నాయో అర్థం కావడం లేదంటే అతిశయోక్తి కాదు. కార్లు, బైకుల్లో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారంటే వారిది ధైర్యమో లేక చేస్తున్న తప్పుల నుంచి రక్షణ పొందేందుకు అనుకోవాలో తెలియడం లేదు. చిన్నచిన్న విషయాలకైనా, కుటుంబ గొడవలకైనా సై అంటే.. సై అన్నట్టుగా గ్యాంగ్‌లను వెంటేసుకొని మరీ గొడవలు పడడం సర్వసాధారణంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
నేరచరితులపై నిఘా కరువు..
గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న చాలా మందిపై పోలీసుల నిఘా కరువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడి పని చేసిన అధికారులు, సిబ్బంది హోదా పెరిగి ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు ఇక్కడ నేరం చేసే వారికి సహకరిస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి. గతంలో నేరచరిత ఉన్న వారిలో కొందరు గంజాయి విక్రయం.. సట్టా నిర్వాహణ.. పీడీఎస్ రైస్ దందా చేస్తూ యువకులను ఏర్పాటు చేసుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది.
పోలీసులు గస్తీని ముమ్మరం చేయాలి..
ఇటీవల జరిగిన వరుస ఘటనల్లో మచ్చుకు కొన్ని. కరీమాబాద్‌లోని బొమ్మలగుడి వద్ద అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి గొడ్డలితో మరో వ్యక్తిని చంపేందుకు వెంబడించాడు. ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని గుడిసె బడి ప్రాంతంలో పెళ్లి బరాత్ వద్ద జరిగిన గొడవలో ఓ యువకుడిని కొందరు కర్రలతో కొట్టగా తీవ్ర గాయాలతో దవాఖానలో చేరాడు. ఉర్సు గుట్ట వద్ద ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో చంపేందుకు యత్నించాడు. ఉర్సు బైపాస్ రోడ్డులో ఇక్కడ మూత్రం ఎందుకు పోస్తున్నావన్నందుకు కత్తితో హత్యకు పాల్పడ్డాడు. తాజాగా జన్మభూమి జంక్షన్ రోడ్డులో కత్తులతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. శంభునిపేటలో యువకుడిపై కత్తులతో దాడి చేశారు. ఫోర్టురోడ్డులోని వాల్మార్డ్ సమీపంలో వ్యక్తిపై కర్రలతో దాడి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరంతర నిఘాతో పోలీసులు గస్తీ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.