Alimpur | బచ్చన్నపేట, జూన్ 6 : ఆలింపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆ గ్రామ నివాసి, ఎన్నారై వంగాల శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బడిబాట గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు రావాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఉచిత పుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య, ఆంగ్ల బోధన, మరుగుదొడ్ల సౌకర్యం, మంచినీటి సౌకర్యం ఉన్నాయన్నారు. ప్రతి విద్యార్థి పోటీత త్వంతో చదవాలని కోరారు. పాఠశాలకు ఫిల్టర్ వాటర్ సౌకర్యం, అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.
మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మసూద్లు మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలన్నారు. మన ఊరు, బడిని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుకునే బాలికలను కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చేర్పించాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. గ్రామాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చిన శ్రీకాంత్ రెడ్డిని శాలువాతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాల్నే రేవతి గౌడ్, కారోబార్ మురళి, కస్తూర్బా గాంధీ విద్యాలయ ఉపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ తార, ఉపాధ్యాయులు బాలకృష్ణ, నరసమ్మ, అంగన్వాడీ టీచర్లు విజయ, వినోద, రమాదేవి, ఆశా వర్కర్లు స్వప్న, ప్రమీల, కాంగ్రెస్ నాయకులు జ్యోతి బైరయ్య, జ్యోతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.