వరంగల్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కష్టపడి ఇండ్లు కొనుక్కున్న మధ్య తరగతి వారిని అందులో నుంచి వెళ్ల గొట్టేందుకు ప్రయత్నిస్తున్నది. అన్ని విషయాల్లోనూ రాబడి మాత్రమే చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏండ్ల క్రితం ప్రభుత్వం వద్ద ఇండ్లు కొనుక్కుని ఉంటున్న వారిని ఇబ్బందిపెడుతున్నది. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డు పరిధిలోని ఇండ్లలో ఉంటున్న వారి నుంచి ముక్కుపిండి మరీ బకాయిలు చేస్తున్నది.
మార్చి 31లోపు అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, లేకుంటే ఇండ్లను ఖాళీ చేయాలని హౌసింగ్ బోర్డు నోటీసులు జారీ చేసింది. హౌసింగ్ బోర్డు గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించింది. నిర్దేశిత వాయిదాల ప్రకారం చెల్లింపులు చేసిన తర్వాత రిజిస్ర్టేషన్లు చేసేలా ఈ ప్రక్రియ ఉంటుంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, ఇతర ప్రతికూల పరిస్థితులతో హౌసింగ్ బోర్డుకు గడువులోపు కొందరు చెల్లింపులు చేయలేకపోయారు.
తెలంగాణ హౌసింగ్ బోర్డు ఇటీవలే వీరి వివరాలను సేకరించింది. అందరికీ నోటీసులు పంపింది. గడువులోపు చెల్లింపులు పూర్తి చేయాలని, లేకుంటే ఇండ్లను ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్మించిన ఇండ్లను అత్యధికంగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారే కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ఇలా చేయడంతో ఇండ్లలో ఉంటున్న వారు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన అందరికీ సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం బకాయిల విషయంలో తమను ఇబ్బందిపెట్టడం సరికాదని అంటున్నారు.
తెలంగాణ హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ పరిధిలో వడ్డేపల్లి(హనుమకొండ), గొర్రెకుంట(వరంగల్), జగిత్యాల, నస్ పూర్(మంచిర్యాల), మరిపెడ(మహబూబాబాద్), కరీంనగర్, జమ్మికుంట, జనగామ, కొత్తగూడెం కాలనీల్లోని ఇండ్లకు సంబంధించి రూ.44.69 కోట్ల బకాయిలు ఉన్నాయి. వరంగల్ డివిజన్ పరిధిలో 528 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 31 లోపు బకాయిలు చెల్లించకపోతే ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులో పేరొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే హౌసింగ్‌పై సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు నోటీసులు జారీ చేసింది.
బకాయిల కోసమే
పేరుకు పోయిన బకాయిలు వసూలు చే సేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ ప్రక్రియ లో భాగంగానే బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. మార్చి 31లోపు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరాం. లబ్ధిదారులు గడువులోపు చెల్లింపులు పూర్తి చేయాలి.
– అంకంరావు, ఈఈ, హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్