రాయపర్తి : పాలకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ వేదికగా బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్ సవాల్ విసిరారు. గురువారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు సాగిందన్నారు.
నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలు, పల్లెలు, గిరిజన తండాలకు సైతం సకల సౌకర్యాలు కల్పించి పట్నాల వలె తీర్చిదిద్దాడని కొనియాడారు. రాష్ట్రంలో 17 నెలలుగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలకుర్తి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు కేవలం పత్రికా ప్రకటనలు, ఫొటోలకు ఫోజులు ఇవ్వడంతోనే కాలం వెలిబుచ్చుతున్నారని ఆరోపించారు.
మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఎన్నికల ముందు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించాలని, ప్రస్తుత పాలకులకు ఆ పనులను కూడా పూర్తి చేయించడం చేతకావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గం లోని కొందరు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ల మెప్పుకోసం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లిపై అసత్యపు ఆరోపణలు, అసందర్భ వ్యాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు మానుకొని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని ఆయన హితవు పలికారు.
లేనిపక్షంలో భవిష్యత్తులో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు అధికార కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, లేతాకుల రంగారెడ్డి, పూస మధు, గారే నర్సయ్య, గజవెల్లి ప్రసాద్, చిన్నాల లక్ష్మీనారాయణ, కంది ప్రభాకర్, చిలువేరు సాయి గౌడ్, భాషబోయిన సుధాకర్, చందు రాము యాదవ్, సతీష్ యాదవ్, మైస వెంకటేశం, గబ్బెట యాకయ్య, గుగులోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.