నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయింది. తమ మనస్సుకు నచ్చిన బైకులు, కార్లు కొనాలనుకునే వారి కోసం ప్రముఖ కంపెనీల వాహనాలను ఒకే వేదికపైకి తీసుకురాగా నగరవాసుల నుంచి విశేష స్పందన వచ్చింది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనప్రియులు స్టాళ్లను సందర్శించి తమకు నచ్చిన బైక్‌లు, కార్లను టెస్ట్ రైడ్ చేయడంతో పాటు ఈవీలపైనా ఓ లుక్కేశారు. ప్రదర్శించిన అన్ని వాహనాలను తరచి చూసి వాటి వివరాలు తెలుసుకొని నచ్చిన వాహనాలను కొనుగోలు చేశారు. కొందరు లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకొని సంబురపడ్డారు. ఇలా శని, ఆదివారాల్లో కొనసాగిన ఆటోషో సందర్శకులతో కిటకిటలాడగా, వాహనాల ప్రేమికుల కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటుచేయడం అభినందనీయమని నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
– హనుమకొండ చౌరస్తా, మార్చి 17
ఆధునిక సాంకేతికతతో పాటు సరికొత్త ఫీచర్లతో వచ్చిన పలు కంపెనీల ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లు ఆటోషోలో ఆకట్టుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా పెరగడంతో వినియోగదారులు వాటిపై ఆసక్తి చూపించారు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చితే వీటి ధరలు, ఇంధన వ్యయం తక్కువగా ఉండటంతో సందర్శకులు ఈవీల కొనుగోలుకు ఆసక్తి చూపారు.
ఆటోషోలో ప్రముఖ కంపెనీల కార్లు, బైకులను రయ్.. రయ్‌మంటూ సందర్శకులుచక్కర్లు కొట్టారు. సందర్శనకు వచ్చిన వినియోగదారులు తమకు నచ్చిన వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేశారు. వాహనప్రియులు ఎక్కువగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా చేతక్ వాహనాలపై గ్రౌండ్లో ఓ రౌండ్ వేశారు. ఆ తర్వాత నచ్చిన కార్ల గురించి తెలుసుకుని వాటినీ నడిపారు.
వినియోగదారులకు ప్రస్తుతం ఇలాంటి వేదికలు చాలా అవసరం. అన్ని కంపెనీలకు చెందిన వాహనాలు ఒకేచోట ఉండడం వల్ల అవసరాల ప్రకారం కొనుగోలు చేసుకోవచ్చు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా సొంత కారు కలను నెరవేర్చుకునే అవకాశం ఉంది.
– వై.రమేశ్, వినియోగదారు
ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఆటోషోను వరంగల్ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే. వాహన ప్రేమికుల కలను సాకారం చేసేందుకు వారికి కావాల్సిన వాహనాలను స్టాళ్లలో ప్రదర్శించగా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కారు, బైక్ మోడళ్ల వివరాలను ఆయా కంపెనీల ప్రతినిధుల ద్వారా అడిగి నివృత్తి చేసుకున్నారు. కొందరు ఉత్సాహంగా టెస్ట్ రైడ్ చేయగా మరికొందరు వెనువెంటనే కార్లు, బైక్‌లను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్, ఏజీఎం ఎం.రాజిరెడ్డి, బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, యాడ్ మేనేజర్లు అప్పని సూరయ్య, శ్రీచరణ్ ఆనంద్, సర్క్యులేషన్ మేనేజర్ ఎడెల్లి సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
స్టాళ్ల సందర్శనకు వచ్చిన వారిని ప్రోత్సహించేందుకు నమస్తే బంపర్ డ్రా ఏర్పాటు చేసింది. డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేసింది. రోజూ లక్కీ డ్రా ద్వారా ముగ్గురికి బహుమతులు అందించింది.
ప్రజల సౌకర్యార్థం నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటోషోలు నిర్వహిస్తున్నాం. అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అన్ని వాహనాలు ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఆటోషో ఏర్పాటు చేశాం. గతంలో ఇలాంటి షోలు ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు మన నగరాల్లో కూడా అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని జిల్లాల్లో ఆటోషోలు నిర్వహించి వాహనప్రియుల కలను సాకారం చేస్తున్నాం. ఇకముందు కూడా మరిన్ని షోలు నిర్వహిస్తాం.
– ఎన్.సురేందర్‌రావు, నమస్తే తెలంగాణ అడ్వర్టయిజ్‌మెంట్స్ జనరల్ మేనేజర్
ఆడి ఏ6 కారు కోసం వచ్చా. ఇప్పటికే ఆడి ఏ3 కారు ఉంది. అత్యాధునికమైన కార్లు అందుబాటులో ఉండటంతో తీసుకుందామని వచ్చాను. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటో షోలో అన్ని వాహనాలను ఒకేచోటకు చేర్చారు. దీంతో కావాల్సిన కార్లు, బైక్‌లను కొనుగోలు చేయవచ్చు.
– బబ్బుల కిషన్‌ప్రసాద్, వ్యాపారి
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షోలో మా తాతకు బైక్ కొనుగోలు చేసేందుకు వచ్చాం. అన్ని రకాల బైక్‌లు స్పెషల్ డిస్కౌంట్‌తో ఇక్కడ ఉంచారు. అన్ని షోరూంలు తిరగాల్సిన పనిలేదు. నచ్చిన వాహనాన్ని ఇక్కడే కొనుగోలు చేశాం.
– కందకట్ల నారాయణ, భరత్ (తాతా మనవడు)
నెక్సా కంపెనీ వినియోగదారుల అభిప్రాయాలను గౌరవిస్తుంది. వారి అభిరుచులకు అనుగుణంగా కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. పల్లెల నుంచి పట్టణాల వరకు ఎవరైనా ఆదరిస్తారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం.
– కల్వాల శశికిరణ్‌రెడ్డి, నెక్సా షోరూం మేనేజర్, ములుగు రోడ్
ఒకే వేదిక పైకి బైక్‌లు, కారు కంపెనీలను తీసుకురావడం అభినందనీయం. ఈ ఆటోషోలో మా గ్రీన్ హోండా స్టాల్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎంతో మంది సందర్శించారు. మా కంపెనీ రూ.7.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ధర పలికే కార్లు ప్రదర్శనకు ఉంచాం.
– అల్లూరి పరమేశ్వర్, ఏజీఎం, గ్రీన్‌హోండా, వరంగల్
అన్ని మోడల్స్ కార్లు, బైక్‌లతో ఈ ప్రదర్శన బాగుంది. దీనివల్ల వాహనాలు కొనాలనుకునేవారి టైమ్ వేస్ట్ కాదు. ఒకేచోట అన్ని మోడల్స్ చూడవచ్చు. సామాన్యులు సైతం సొంత కార్లపై ఆసక్తి చూపుతున్నారు. అన్ని రకాల మోడల్స్ కారు, బైక్‌లు, వాటి వివరాలు ఒకేచోట లభించడం ప్రయోజనకరం.
– శ్రీనివాస్, నానో ఫ్యాషన్స్
హనుమకొండ, మార్చి 17: ఇప్పటివరకు మెట్రో సిటీలకే పరిమితమైన అత్యాధునిక వాహనాలను హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలోని ప్రజలకు పరిచయం చేసేందుకు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఆటోషో ఏర్పాటుచేయడం అభినందనీయమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆటోషో ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి స్టాల్‌ను సందర్శించి వాహనాల ప్రత్యేకతలు, పనితీరును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కడియం మాట్లాడుతూ వార్తలను ప్రచురించడమే కాకుండా ప్రజా అవసరాలను గుర్తించి గతంలో ప్రాపర్టీ షో, ఇప్పుడు ఆటోషో నిర్వహించారని, పత్రికల ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరం అన్నారు.
ఈ వేదిక ద్వారా నగరంలో ఉన్న కంపెనీల వాహనాలతో పాటు బెంజ్, వోల్వో, ఆడి లాంటి టాప్ మాడల్స్‌ను పరిచయం చేశారన్నారు. ఇది కస్టమర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రముఖ కార్ల కంపెనీలు, మోటర్ బైక్, ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలను ఒకే వేదికపై పరిచయం చేసి కొనుగోలుదారులు హైదరాబాద్ లాంటి నగరాలకు పరుగెత్తకుండా టాప్ మాడల్స్ బ్రాండెడ్ కార్లు బుక్ చేసుకొనే అవకాశం కలిగిందన్నారు. అనంతరం కంపెనీల ప్రతినిధులకు మెమెంటోలు అందజేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మెమెంటో అందించారు.
కియా మోటర్స్ కంపెనీ కార్లకు తెలుగు రాష్ర్టాల్లో అపూర్వ ఆదరణ కనిపిస్తోంది. ఒకే చోట అన్నిరకాల కంపెనీలకు చెందిన వాహనాలను చేర్చడం మంచి ఆలోచన. ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయాలి. రెండు రోజుల ప్రదర్శనలో నగరవాసులు స్టాల్స్‌ను సందర్శించి కారు ఫీచర్స్‌ను అడిగి తెలుసుకున్నారు.
– గంజి సంజీవ్, బిజినెస్ హెడ్, మాలిక్ కియా, ములుగురోడ్
ఆటోషో ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యాలకు కృతజ్ఞతలు. ఆటోషోలో మా స్టాల్‌కు మంచి ఆదరణ వచ్చింది. చాలామంది నగరవాసులు కొనుగోలుకు ఆసక్తి చూపారు. చాలామంది స్టాళ్లను సందర్శించారు.
– కె.ప్రవీణ్‌కుమార్, సేల్స్ మేనేజర్, పీపీఎస్ మోటర్స్ ఫోక్స్‌వ్యాగన్, హంటర్‌రోడ్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోషోలో మా చేతక్ స్టాల్‌ను అనేకమంది యువకులు సందర్శించారు. మార్కెట్లో ఎంతో క్రేజ్ ఉన్నందున యువకులు భారీగా వచ్చి మా వాహనాలను టెస్ట్రైడ్ చేశారు. కంపెనీకి మార్కెట్లో ఉన్న ఆదరణకు తోడు ఆటోషోలో మాకు అవకాశం రావడం సంతోషం.
– టి.వెంకట్, జనరల్ మేనేజర్, చేతక్, వరంగల్
మార్కెట్లో యమహా వాహనాలకు మంచి క్రేజ్ ఉంది. యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఆటోషోలో ఫ్యాసినో, ఏరోక్స్, రేజెడ్ఆర్, స్కూటర్స్, ఎఫ్జెడ్స్ బైక్‌లు ప్రదర్శన ఉంచగా మంచి స్పందన వచ్చింది. చాలామంది మా స్టాల్‌ను సందర్శించి బైక్స్ కొనుగోలు చేయడం సంతోషం.
– మహ్మద్ రియాజ్‌పాషా, ఆథరైజ్డ్ యమహా డీలర్, హ్యాపీ ఆటోమోటివ్స్, ములుగురోడ్