ములుగురూరల్, మే 31 : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో నో టొబాకో ర్యాలీని నిర్వహించారు. ములుగు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బస్టాండ్ వరకు వైద్య సిబ్బంది చేపట్టిన ఈ ర్యాలీని డీఎంహెచ్వో డాక్టర్ గోపాల్రావు జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం గోపాల్రావు మాట్లాడుతూ.. ప్రజలకు అవగాహన కల్పించి గుట్కా, తంబాకు, సిగరెట్, బీడీ వంటి వాటికి దూరంగా ఉంచడమే ఈ ర్యాలీ ఉద్దేశమని తెలిపారు. భారత్లో మూడు లక్షల పైచిలుకు మరణాలు పొగ తాగడం వల్లే సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. పొగాకులో ఉండే నికోటిన్ మెదడుపై పనిచేయడంతో మత్తుకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు. ఈ ఉత్పత్తులలో 69 రకాల క్యాన్సర్ కారక రసాయనాలు ఉంటాయని పేర్కొన్నారు. వీటి ద్వారా లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పారు.
బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం వల్ల తాగే వ్యక్తితో పాటు ఇతరులు కూడా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని గోపాల్రావు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, సినిమా హాల్లో, మార్కెట్లో, విద్యాసంస్థల్లో, ఆస్పత్రుల్లో పొగాకు ఉత్పత్తులు వాడటం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఇది ఉల్లంఘించిన వారికి రెండు వేల రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పారు. అనంతరం పొగాకుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.