కరీమాబాద్, అక్టోబర్ 14 : ప్రభుత్వం రవాణా శాఖలో నూతనంగా తీసుకొచ్చిన నూతన ఆన్లైన్ సేవలు సారథి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నది. ఈ మార్పులు అధికారులకు కొత్త తల నొప్పు లు తెస్తుండగా వాహనదారులు గంటల తరబడిగా నిరీక్షించాల్సి వస్తున్నది. మంగళవారం ఆన్లైన్ సేవలు స్లోగా ఉండడంతో వాహనదారులతో రవా ణా శాఖ కార్యాలయం కిక్కిరిసిపోయింది. రెండు కౌంటర్లు ఉండగా ఆన్లైన్ సేవలు సరిగా పనిచేయకపోవడంతో వాహనదారులు లైన్లలో చాలాసేపు నిలబడ్డారు. కంప్యూటర్లలో ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతున్నా తప్పు అని వస్తున్నట్లు అభ్య ర్థులు వాపోతున్నారు. ఈ విషయమై వారు అధికారులను నిలదీయగా చేసేదేమీ లేక పరీక్షను మళ్లీ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం నూతనంగా డ్రైవింగ్ లెసెన్సులు తీసుకునేవారికి ప్రభుత్వం కార్డులను ఇవ్వకున్నా వాటిని పంపేందుకని పోస్టల్ చార్జీలను మాత్రం యథావిధిగా వసూలు చేస్తున్నది. ఇదేంటని అధికారులను అడగగా ఆన్లైన్లో వస్తున్న ఫీజులు చెల్లించాల్సిందేనని చెబుతున్నారు.
నూతన యాప్లో తప్పుడు సమాధానాలు చూపుతే సరైనవిగా, సరైనవి చూపితే తప్పుగా వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ అభ్యర్థి లర్నింగ్ లైసెన్స్ కోసం రంగశాయిపేటలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం వచ్చాడు. ఆన్లైన్ పరీక్ష కోసం కంప్యూటర్లో ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం క్లిక్ చేశాడు. కానీ సమాధానం తప్పుగా చూపింది. దీంతో అభ్యర్థి అధికారులతో వాగ్వాదానికి దిగగా మళ్లీ పరీక్ష నిర్వహించారు.
గతంలో ప్రభుత్వం వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు ముద్రించి ఇంటికి పోస్టు ద్వారా పంపించేది. అందుకు కార్డు, పోస్టల్ చార్జీలు వసూలు చేసేది. కానీ నూతనంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సారథి సేవలతో వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను ముద్రించి ఇవ్వడం లేదు. కానీ గతంలో మాదిరిగానే కార్డు ముద్రణకు, పోస్టల్ చార్జీలకు డబ్బులు వసూలు చేస్తున్నది. మళ్లీ లైసెన్స్ లను ఇస్తుందా లేదా అన్న సమాచారం సిబ్బంది సైతం లేదు. కానీ డబ్బులను మాత్రం యథావిధిగా వసూలు చేస్తున్నది. నూతన సేవల్లో మార్పులు చేసిన ప్రభుత్వం చార్జీలో మార్పులు చేయలేదని వాహ నదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.