ఖిలావరంగల్: ఎలక్ట్రానిక్ మిషన్ లతోపాటు కాంటబాట్లను ఏడాదికి ఒకసారి తనిఖీ చేసి స్టాంపింగ్ చేయాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి ప్రధాన కార్యదర్శి మొగిలిచర్ల సుదర్శన్ సూచించారు. జార్ఖండ్‌లోని రాంచీలో కేంద్ర ప్రభుత్వ లీగల్ మెట్రాలజీ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్వర్ కుమార్ నేతృత్వంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న వర్క్ షాప్‌కు వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో పాటు వరంగల్‌కు (Warangal) చెందిన జాతీయ వినియోగదారుల మండలి ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణితోపాటు మొగిలిచర్ల సుదర్శన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొలతల్లో మోసాలను అరికట్టడానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలక్ట్రానిక్ మిషన్లు, కాంటబాట్లను ప్రస్తుతం రెండు సంవత్సకు ఒకసారి తనిఖీ చేయడం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని కాబట్టి దీనిని ఏడాదికి ఒకసారి తనిఖీ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని సూచించారు.
బంగారు ఆభరణాల ఖరీదులో వ్యాపారులు క్యారెక్టర్ రూపంలో నాణ్యతను బిల్లులో రాయాల్సి ఉండగా దానిని మెజరింగ్ రూపంలో అంకెలుగా చూపెడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకునే అధికారం లీగల్ మెట్రాలజీ శాఖకు ఉండాలని కోరారు. దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో లీగల్ మెట్రాలజీ అధికారులు సీనియర్ వినియోగదారుల ప్రతినిధులతో కలిసి తరచూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.