నయీంనగర్, మార్చి 21: వీధి వ్యాపారులపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అనుచరులు ప్రతాపం చూపారు. 20 ఏళ్లుగా పబ్లిక్ గార్డెన్ వద్ద భోజన వ్యాపారం చేసుకుంటూ బతుకీడుస్తున్న చిరు వ్యా పారులపై సదరు వ్యక్తులు ‘ఇక్కడ మావాళ్లు డబ్బా లు పెట్టుకుంటారు, వాళ్లను ఏమీ అనకండి, వారు కూడా ఇక్కడే ఉంటారు.. ఒకవేళ సహకరించకపోతే మున్సిపాలిటీ వారు మీ షాపులను తొలగిస్తారు.. మేం చెప్పినట్టు వినాల్సిందే’నని బెదిరించినట్లు సమాచారం. చిరువ్యాపారులు నడుపుకొంటున్న చిన్నచిన్న హోటళ్ల పక్కన ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించిన వ్యక్తుల దుకాణాలు పెట్టడంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.
బతుకుదెరువు కోసం 10 మందిమి కలిసి ఇక్కడ దుకాణాలు పెట్టుకున్నామని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదని, కానీ ఇప్పుడు వీళ్లంతా వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే తమకు ఏదైనా సాయం చేయాలి గానీ ఇలా పొట్ట కొడితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత సమస్యలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసిన వీధి వ్యాపారులు.. ఎమ్మెల్యే అనుచరుల తీరుపై మండిపడుతూ శాపనార్థాలు పెట్టడం కనిపించింది.
‘మున్సిపల్ అధికారులు ఎవరికి ఎప్పుడు అన్నం పెట్టాలని చెబితే అప్పుడు అన్నం పెడుతూనే ఉన్నాం. అలా చాలామంది అధికారుల పేర్లు చెప్పి భోజనం చేసి పోతుంటారు. అయిన కూడా మేము ఎప్పుడూ వారిని ఏమీ అనలేదు, కానీ ఇవాళ శుక్రవారం ఎవరో చెప్పారని వచ్చి మీ దుణాకాలు ఏమి ఉండకూడదని, అన్ని ట్రాక్టర్లో తరలిస్తాం’ అని బెదిరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.