వరంగల్, అక్టోబర్ 28 : నగర ప్రజలకు స్వచ్ఛమై న నీరు అందించాల్సిన నగర పాలక సంస్థ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రజలకు మురికి నీరు సరఫరా చేస్తూ అధికారులు మినరల్ వాటర్ తాగుతున్నారు. మంగళవారం కాశీబుగ్గ ప్రాంతంలో కలుషితమైన రంగుమారిన నీరు సరఫరా అవుతున్నాయని ప్రజలు బల్దియా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తుంటే మరోవైపు బల్దియా అధికారుల చాంబర్లలో మినరల్ వాటర్ క్యాన్లు వేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ‘మేయర్, కమిషనర్, అధికారులూ ఒక్క గ్లాస్ రంగు మా రిన నీరు తాగండి చాలు .. అందోళన విరమించి వెళ్లిపోతామని కార్యాలయంలోని ప్రతి చాంబర్‌కు తిరిగారు. తమ బాధలను ప్రజాప్రతినిధులు, అధికారుల కు అర్థం కావాలనే ఆవేదనతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
సమస్య పరిష్కారమైంది
రంగు మారిన తాగునీటి సరఫరా సమస్య పరిష్కారమైంది. ధర్మసాగర్ నుంచి వచ్చే రా వాటర్ మురికిగా రావడం వల్ల రెండు రోజులు రంగు మారిన నీరు సరఫరా అయ్యింది. ప్రస్తుతం స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతోంది.
– సత్యనారాయణ, బల్దియా ఎస్ఈ
వామ్మో కార్పొరేషన్ నీళ్లా..
బల్దియా కార్యాలయంలోని ఉద్యోగులకు ఒక్క గ్లాస్ నల్లా నీరు తాగండి అంటే వామ్మో అంటూ సిబ్బంది బెంబేలెత్తారు. అదనపు కమిషనర్ చాంబర్‌తో పాటు ప్రతి చాంబర్‌కు వెళ్లి దేశాయిపేట ఫిల్టర్ బెడ్ నుంచి సరఫరా అయిన తాగునీటిని బాటిళ్లలో తీసుకొచ్చి సిబ్బందికి ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ నీళ్లు అంటేనే సిబ్బంది తాగేందుకు వణికిపోయారు.