హనుమకొండ, సెప్టెంబర్ 17: 1948 సెప్టెంబర్ 17న కొందరు విలీనం విమోచన పేర్లతో పిలుస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని నిజంగా తెలంగాణలో జరిగింది విద్రోహమేనని పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గెట్ వద్ద పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న విద్రోహం దినంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం రాజరికానికి, జాగిర్దారులకి వ్యతిరేకంగా ప్రజలు కమ్యూనిస్టులతో కలిసి పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించి నిజాం సైన్యాన్ని తరిమికొట్టిందన్నారు. 3 వేల గ్రామాలను స్వతంత్ర గ్రామాలుగా ప్రకటించి 10 లక్షల ఎకరాల్లో ఎర్రజెండాలు పాతి ప్రజలకు భూములు పంచారన్నారు.
ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా బడా కార్పొరేట్లకు అప్పచెప్పుతూ దేశసంపద మొత్తం కూడా దోచిపెడుతున్నదని మండిపడ్డారు. రాష్ర్టంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసేదిశగా అడుగులు వేస్తుందని ఆగ్రహం వ్యక్తంగా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా కోశాధికారి సమాజి పవన్, సభ్యుల రాజేష్, గణేష్, యూనివర్సిటీ నాయకులు వైష్ణవి, నందిని, రాజేష్, రాంబాబు పాల్గొన్నారు.