కాశీబుగ్గ, ఆగస్టు 16: వరంగల్‌లోని పండ్ల, మోడల్ కూరగాయల మార్కెట్లను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తానని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. లక్ష్మీపురంలోని మోడల్ కూరగాయల మార్కెట్ సమీపంలో రూ. 4.18 కోట్లతో ప్రాంతీయ మార్కెటింగ్ శాఖ భవన సముదాయ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 100 కోట్లతో మార్కెట్లను అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలు అబ్బురపడే విధంగా తీర్చిదిద్దుతానన్నారు. రూ. 50 కోట్ల మున్సిపల్ నిధులతో రీజినల్ ఆఫీస్‌కు సంబంధించి అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పండ్ల మార్కెట్ రూ. 28 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
నూతనంగా మరో కూరగాయల మార్కెట్‌ను ఏర్పాట్లు చేస్తామని, ఈ రెండింటి మధ్యలో నాన్‌వెజ్, వెజ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మార్కెట్ చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి బయట ఎవరూ అమ్మకాలు చేపట్టకుండా, మార్కెట్ పరిధిలోనే వ్యాపారం జరిగేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. మార్కెట్ నిర్మాణం తర్వాత పైఅంతస్తుల్లో సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని, పక్కా ప్రణాళికతో మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. నియోజకవర్గాన్ని వరంగల్ జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేశామని, ఇక్కడే అతి పెద్ద కూరగాయల మార్కెట్ అవతరించిందన్నారు. ఉన్న స్థలంలోనే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. పండ్ల మార్కెట్ వ్యాపారుల కోసం 20 ఎకరాల స్థలం కేటాయిస్తామని చెప్పామని, గతంలోనే పదెకరాల స్థలం కేటాయించామన్నారు. త్వరలోనే మరో పదెకరాలు కేటాయిస్తామన్నారు. 36 ఉన్న లైసెన్స్‌లను 99కి పెంచామని, వ్యాపారుల శ్రేయస్సు కోసం సుమారు 170 ఫ్లాట్లను అందించామన్నారు.
వరంగల్ తూర్పులో ఉపాధి కల్పన
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉపాధి కల్పన పెద్ద ఎత్తున జరగాలని, వ్యాపారులు అధిక సంఖ్యలో వ్యాపారం చేసుకుని లాభాలు గడించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నదని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. మార్కెట్ అంతా లాకింగ్ సిస్టం ద్వారా పూర్తిస్థాయిలో ప్రహరీ ఏర్పాటు చేసి, బయట అమ్మే వాళ్లకు సైతం లోపల అవకాశం కల్పించామన్నారు. గతంలో టాయిలెట్స్, విశ్రాంతి గది లేదని, ప్రస్తుతం వాటితోపాటు హోటల్ సౌకర్యం కోసం భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పండ్ల మార్కెట్ రూ. 28 కోట్లు, ఇప్పుడు శంకుస్థాపన చేసిన రీజినల్ ఆఫీస్‌కు 4.18 కోట్లు, అదనంగా పండ్ల మార్కెట్‌కు మరో రూ. 27 కోట్లు.. మొత్తంగా రూ. 100 కోట్లతో ఈ మార్కెట్లను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కూరగాయల మార్కెట్, నూతనంగా నిర్మిస్తున్న పండ్ల మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను ఆయన సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్స కోట, జేడీఎం మల్లేశం, డీడీఎం అజ్మీరా రాజునాయక్, డీఎంవో పాలకుర్తి ప్రసాదరావు, కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్, కార్పొరేటర్లు చింతాకుల అనిల్, దిడ్డి కుమారస్వామి, వ్యాపారులు వెల్ది సాంబయ్య, దొంగల చెన్నమల్లు యాదవ్, పాపాని భాస్కర్, బేతి అశోక్‌బాబు, కేడల చంద్రశేఖర్, జారతి శ్రీనివాస్, కామాని రాజు, ఉగ్గె యుగేంధర్ తదితరులు పాల్గొన్నారు.