ఎల్కతుర్తి, అక్టోబర్ 14 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకన్న, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్‌లో జరుగనున్న సీఎం కేసీఆర్ మొదటి ప్రచార ప్రజాఆశీర్వాద సభ విజయవంతం కోసం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ము ఖ్య నాయకులతో వారు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మొదటగా హుస్నాబాద్‌ను సెంటిమెంట్‌గా భావించి, ఇక్కడి నుంచే ప్రచారం మొదలు పెడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొదటగా తాము పాలిస్తున్న రాష్ర్టాల్లో ఇక్కడి పథకాలను అమలు చేసిన తర్వాతే ఓటు అడగాలన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి చివరి రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులకు మిషన్ కాకతీయ, ఎకరాకు రూ.10వేల రైతు బంధు, రైతు బీమాను అందించడంతో పాటు కాళేశ్వరం, దేవాదుల ద్వారా సాగునీటిని, 24 గంటల ఉచిత కరెంటు అందించారన్నారు. ఇటీవల రైతులకు రూ.లక్ష రుణమాఫీ కూడా చేశామని గుర్తు చేశారు. వృద్ధులకు రూ.2016, దివ్యాంగులకు రూ.4016 పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థికసాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఇదివరకు ఆంధ్రాలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో 20 ఎకరాలు వచ్చేదని, ప్రస్తుతం తెలంగాణలో ఎకరం అమ్మితే రూ.కోటి పైగా ధర పలుకుతుందన్నారు. ప్రతిపక్షాలు అమలు కాని మేనిఫెస్టో ప్రకటించారని, ప్రజలు మోసపోవద్దన్నారు. పనిచేసే ప్రభుత్వా న్ని ఆశీర్వదించాలని కోరారు. ఆదివారం హుస్నాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో భీమదేవరపల్లి ఇన్చార్జి శోభన్‌కుమార్, డాక్టర్ ప్రతీక్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, నాయకులు గొల్లె మహేందర్, సర్పంచ్ కొమ్మిడి నిరంజన్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్‌రెడ్డి, పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, మదన్మోహన్రావు, అల్లకొండ రాజు, లోకిని సూరయ్య, జంగం రాజు పాల్గొన్నారు.