హనుమకొండ చౌరస్తా, జూన్ 3: అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు, జాతీయ యువజన అవార్డు గ్రహీత మండల పరశురాములు 200 పుస్తకాలు హనుమకొండ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అందజేశారు. గ్రంథాల యానికి వివిధ జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఉన్న 200 విలువైన పుస్తకాలను అందించారు. ఈ పుస్తకాలను హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్ తన ఛాంబర్లో స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పుస్తకాలు విరాళంగా ఇవ్వడం అంటే జ్ఞానాన్ని అందరితో పంచుకో వడమే అన్నారు. చదవడం వలన జ్ఞానం పెరుగుతుందన్నారు. సమాజసమస్యలకే కాదు, వ్యక్తిగత సమస్యలకు కూడా పుస్తకాలు పరిష్కారాలను సూచిస్తాయన్నారు. అజిజ్ఖాన్ మాట్లాడుతూ దాతలు కూడా ఇలా పుస్తకాలు విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్-3 గ్రంథపాలకులు పురుషోత్తం, కంప్యూటర్ ఆపరేటర్ రాజేష్ ఉన్నారు.