గిర్మాజీపేట, జనవరి 12 : ‘మన ఊరు- మనబడి’ పనులను మార్చి 30లోపు 100 శాతం పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు నల్లబెల్లి, పర్వతగిరి మండలాల్లో మాత్రమే పూర్తయ్యాయని, మిగతా మండలాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వెంటనే పూర్తిచేయాలని సూచించారు. పనుల్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
అంతకుముందు ‘కంటివెలుగు’పై హైదరాబాద్ నుంచి మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. 18 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేస్తామన్నారు. అనంతరం ఈ నెల 9 నుంచి 11వరకు నిర్మల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్‌లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థులు, గైడ్ టీచర్లను సన్మానించారు. అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్విని తానాజీ వాకడే, డీఈవో వాసంతి, డీఆర్డీవో సంపత్‌రావు, జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందనలు..
వర్ధన్నపేట: రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో ఆల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు ఏ శ్రీవధ, జే నందిత ప్రదర్శించిన హైడ్రోప్రోనిక్స్ ఫార్మింగ్ ఎగ్జిబిట్ జాతీయస్థాయికి ఎంపికైంది. కాగా, విద్యార్థులను కలెక్టర్ గోపి అభినందించారని పాఠశాల చైర్మన్ నరేందర్‌రెడ్డి తెలిపారు.