కరీమాబాద్, జూన్ 9 : తన స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపిస్తూ ఉర్సు ప్రాంతానికి చెందిన పోలెపాక కుమారస్వామి సోమవారం ఉర్సు బైపాస్‌రోడ్డులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు, కుటుంబసభ్యులు అతడిని ఎంజీ ఎం దవాఖానకు తరలించారు. కుమారస్వామి కొడుకులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల క్రితం మా తాతకు ఉర్సు శివారులో సుమారు ఆరున్నర ఎకరాల స్థలం ఉండేది. మా వాళ్లను బెదిరించి బండి కుమారస్వామి సంతకాలు చేయించుకున్నాడు.
ఇది ఎస్సీలకు ఇచ్చిన భూమి అని, పట్టా మారదని చెప్పినా అడ్డదారిలో మార్చుకున్నాడు. నాలుగెకరాలకు డబ్బులిచ్చి, ఆ స్థలాన్ని తాళ్ల పద్మావతి విద్యా సంస్థలకు అమ్మాడు. ఈ విషయమై కళాశాల యాజమాన్యాన్ని అడుగగా, తాము డబ్బులిచ్చి కొన్నామని, పక్కన 14 గుంటల స్థలం ఉంది.. దానిని తీసుకోమని చెప్పారు. సరే అని అందులోకి వెళ్తే పులి రంజిత్‌రెడ్డి ఈ స్థలం తనదని, ఇక్కడకు వస్తే మీ సంగతి చూస్తానని బెదిరిస్తున్నా డు.
దీంతో మనస్తాపానికి గురై మా తండ్రి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. విషయం తెలుసుకున్న మిల్స్కాల నీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు, కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కుమారస్వామి కుమారు డు శ్యాం ఫిర్యాదు మేరకు బండి కుమారస్వామి, పులి రంజిత్‌రెడ్డి, తాళ్ల పద్మావతి విద్యా సంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశంపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు ఆత్మహత్య ప్రేరేపిత కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి..
నిందితులు బండి కుమారస్వామి, పులి రంజిత్‌రెడ్డి, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల యాజమా న్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కడారి కుమార్ డిమాండ్ చేశారు. పలు దళిత సంఘాల నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. నిందితులకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని, కఠినంగా వ్యవహరించాలని కోరారు.