బయ్యారం, మే 21 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు ఓ వైపు రైతులు అరిగోస పడుతుంటే, మరో వైపు సర్కారుకు అమ్మిన పంట పైసలు నేటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో అనేక మంది అన్నదాతలు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లాలో యాసంగిలో 1,49,627 ఎకరాల్లో రైతులు మక్కజొన్న సాగు చేయగా, 4.57 లక్షల మెట్రిక్ టన్నుల పంట వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే మక్కలను కొనేందుకు సర్కారు మార్చి 27న జిల్లాలో 25 మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి మక్కలను కొన్నది. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో 17,577 మంది రైతులకు చెందిన 90.220 మెట్రిక్ టన్నుల (18,04,409 బస్తాల) మక్కలను కొనుగోలు చేయగా, రూ. 216.50 కోట్ల బకాయిలు సర్కారు చెల్లించాల్సి ఉన్నది. అంతేకాకుండా గన్నీ బ్యాగులకు సంబంధించి బస్తాకు రూ.21 చొప్పున రూ. 3.78 కోట్లు బకాయి ఉన్నది. అదేవిధంగా కాంటాలు ప్రారంభమై రెండు నెలలు కాస్తున్నా నేటికీ రైతుల ఖాతాల్లో ఒక్క పైసా కూడా జమ కాకపోవడంతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. మక్కల కొనుగోలు సమయంలోనే రైతుల బ్యాంక్ ఖాతాలు, ఎన్ని బస్తాలు, ఎంత డబ్బులు అనే వివరాలు మార్క్ఫెడ్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తుండగా వాటి ఆధారంగా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉన్నది. కానీ ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఒక్క రైతు ఖాతాలో సైతం డబ్బులు పడకపోవడంతో ఎప్పుడు పడుతాయోనని ఎదురు చూస్తున్నారు. సర్కారు ఇచ్చే డబ్బులతో వానకాలం పంటల పెట్టుబడి కోసం సన్నద్దం కావాల్సి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరి కొందరు రైతులు నిరాశ చెంది మద్దతు ధర కంటే క్వింటాకు రూ. 500 నుంచి రూ.700 తక్కువ ధరకు బయటి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా మక్కల డబ్బులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా మక్క కొనుగోళ్లు పూర్తికాకపోవడంతో ఇంకా కేంద్రాల్లో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఇప్పటికే 90.220 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోళళ్లు చేసినా మార్క్ఫెడ్ ఇంకా 15 నుంచి 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తాయని అంచనా వేస్తుండగా, అంచనాకి మించి మక్కలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే కలెక్టర్ స్నేహాశభరీశ్తో పాటు ఎస్పీ శభరీశ్ వారం రోజులుగా మక్కజొన్న కొనుగోళ్లు, రవాణా విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు.
రైతుల మక్కజొన్న కొనుగోలు డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోనే త్వరలో జమచేస్తాం. కేంద్రాల్లో రైతులు విక్రయించిన పంటల పూర్తి వివరాలు ఆన్లైన్ చేశాం. త్వరలోనే చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెల చివరి వరకు జిల్లాలో మక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేసా్ంత. కేంద్రాలకు వచ్చిన మక్కలను పూర్తి స్థాయిలో కొంటాం.
-శ్యాం, మార్క్ఫెడ్ డీఈ
యాసంగిలో 3.5 ఎకరాల్లో మక్కజొన్న సాగు చేశా. 115 క్వింటాళ్లు మక్కలను 40 రోజుల క్రితం బయ్యారంలోని మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ఇప్పటి వరకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చాలి. వర్షాలు పడితే మళ్లీ పంట పెట్టుబడికి కూడా డబ్బులు కావాలే. ఇంకా పైసలు వేయకుంటే ఎట్లా. పంట విక్రయించేందుకు అప్పుడు కేంద్రాల్లో రోజుల తరబడి రైతులు పడిగాపులు కాశారు. ఇప్పుడు పైసల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాం. పంట కొనుగోలు డబ్బులు వెంటనే ఖాతాల్లో జమ చేయాలి.
– బీరెడ్డి కృష్ణ, రైతు, బయ్యారం