కొత్తగూడ, జూన్ 3 : ఏజెన్సీలో ఆదివాసీలదే హక్కు అని, ఖనిజ సంపదను దోచుకుంటే ఊరుకోమని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్ హెచ్చరించారు. అటవీ సంపదపై దృష్టి సారించిన ప్రభుత్వాలు ఆదివాసీ చట్టాలను అమలు చేయడంలో విఫలమవుతున్నాయన్నారు. బుధవారం మండల కేంద్రంలో పోరు కేక బహిరంగ సభను తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ముందుగా మండల కేంద్రంలో కొమురంభీం, బియ్యాల జనార్ధన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల నడుమ ర్యాలీని నిర్వహించారు. అనంతరం సభలో మాట్లాడుతూ ఇతర రాష్ర్టాల్లో ఓసీ లు, బీసీలుగా చెలామణి అవుతున్న లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి ఆదివాసీలకే ఉద్యో గ, విద్యావకాశాలు కల్పించాలన్నారు. జూన్ 30లోగా ఆదివాసీల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచించి చర్చలకు పిలువకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తాత, ముత్తాతల నుంచి పోడు సాగుతో అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించకుంటే దశల వారీగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అరుణ్‌కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో సమన్వయ కర్త రామకృష్ణ, పోశయ్య, విజయ్, సీతారాం, సిద్దబోయిన లక్ష్మీనారాయణ, వట్టం సాయిలు, ఈసం సుధాకర్, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ సభకు మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి ఆధ్వర్యంలో భారీ బందోబస్తును నిర్వహించారు. ఆరుగురు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 39 మంది ఎస్సైలు, 560మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించారు. సభ నిర్వహణ నేపథ్యంలో ఆదివాసీలు, లంబాడీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని పరస్పర దాడులకు దిగుతారని భావించి విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు.