CIBIL | ఖిలావరంగల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతి యువకులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ డిమాండ్ చేశారు. వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వివిధ విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జిల్లా వ్యాప్తంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువతీయువకులు దరఖాస్తు చేసుకున్న వారికి చాలావరకు సిబిల్ స్కోర్ నిబంధనతో అర్హత కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. చాలామంది యువతి యువకులు సంబంధిత మండల పరిషత్ కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొందన్నారు.
కావున రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ తక్షణమే స్పందించి సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తివేసి అర్హులైన ప్రతీ ఒక్కరికీ రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా జీవో జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా మాజీ నాయకులు శనిగరపు రాజేంద్రప్రసాద్, ఒంటెరూ చక్రి తదితరులు పాల్గొన్నారు.