భీమదేవరపల్లి, ఆగస్టు 13 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఈనెల 20వ తేదీ నుంచి లక్కాకులమ్మ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వ్యవస్థాపక అధ్యక్షుడు కుక్కముడి ప్రభుదాస్ తెలిపారు. బుధవారం గట్లనర్సింగాపూర్ గ్రామంలో కోదండ రామాలయం వద్ద లక్కాకులమ్మ జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20వ తేదీన మహాగణపతి పూజ, అమ్మవారికి పంచామృతాభిషేకములు, అలంకరణ, శక్తి హోమము, అఖండ దీపారాధన, బోనం సమర్పణ, 21వ తేదీన అమ్మవారికి అష్టోత్తర సహస్ర నామార్చన, అభిషేకము, కుంకుమ పూజలు, ముడుపులు సమర్పించుట, 22వ తేదీన ప్రత్యేక ముడుపులు సమర్పించుట ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. సంతాన సౌభాగ్యానికి ప్రతీక మాత్రమే కాకుండా కోరిన కోరికలు తీర్చే అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. గుట్టపైన గుహలో కొలువుదీరిన లక్కాకులమ్మ అమ్మవారిని భక్తులు దర్శించుకొనేందుకు పూర్తి సదుపాయాలు కల్పించామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో లక్కాకులమ్మ జాతర ధర్మకర్తలు మండల రవీందర్, చల్లూరి రవీందర్, రాంపల్లి రాజవీరాచారి, గడల రాజయ్య, గుఱ్ఱపు కొమురయ్య, నీలిగొండ వీరస్వామి, బామండ్లపల్లి కనుకయ్య, మంద శ్రీధర్, బామండ్లపల్లి ప్రభాకర్, మంత్రి కుమారస్వామి, సంగ సుధాకర్, సట్ల శ్రీనివాస్, రాచర్ల శివ, ఏనుగు మధు తదితరులు పాల్గొన్నారు.