మహదేవ్పూర్, జూన్ 16 : విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజకుమార్ ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ 18వ జాతీయ మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. కేరళ రాష్ట్రంలో ఈనెల 27 నుంచి 30 వరకు జరిగే ఎస్ఎఫ్ఐ 18వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రాజ్ కుమార్ పిలుపునిచ్చారు.
తక్షణమే మండల కేంద్రంలో చదువుకునే విద్యార్థులకు ఎస్ఎంఎస్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుంచి విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి విద్యార్థులని మోసం చేసిందన్నారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని లేనియెడల విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.